Telugu Global
Telangana

పసికందు ఆకలి తీర్చేందుకు ఆవును కొనిచ్చిన మంత్రి హరీశ్ రావు

రాజుగూడలో కేవలం పది లోపే కుటుంబాలు జీవిస్తున్నారు. ఎవరి వద్ద పశు సంపద లేకపోవడంతో పాలు దొరకడం కష్టంగా మారింది.

పసికందు ఆకలి తీర్చేందుకు ఆవును కొనిచ్చిన మంత్రి హరీశ్ రావు
X

తల్లిని కోల్పోయిన నవజాత శిశువు పాల కోసం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఓ ఆవును కొనిచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అదిలాబాద్ జిల్లా రాజుగూడకు చెందిన కొడప పారుబాయి (22) జనవరి 10న ఇంద్రవెల్లి పీహెచ్‌సీలో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డతో పాటు, తల్లిని కూడా మరుసటి రోజు గూడేనికి తీసుకొని వెళ్లారు. అయితే అనారోగ్యం కారణంగా పారుబాయి కన్నుమూసింది. అప్పటి నుంచి పసి పాప ఆకలి తీర్చేందుకు తండ్రి జంగుబాబు, తాత బాపురావు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

నిత్యం తమ గూడెం నుంచి ఇంద్రవెళ్లికి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాల ప్యాకెట్ కొని తీసుకొని వస్తున్నారు. రాజుగూడలో కేవలం పది లోపే కుటుంబాలు జీవిస్తున్నారు. ఎవరి వద్ద పశు సంపద లేకపోవడంతో పాలు దొరకడం కష్టంగా మారింది. ఇటీవల ఐటీడీఏ కార్యాలయంలో పసిపాప ఆకలి తీర్చడానికి ఆవును మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు.. బిడ్డకు పాల కొరత లేకుండా ఆవును సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అందుకు అయ్యే ఖర్చును తాను ఇస్తానని మంత్రి చెప్పారు. అంతే కాకుండా తక్షణం పసిబిడ్డ దగ్గరకు వెళ్లి పాల ప్యాకెట్లతో పాటు, పౌష్టికాహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి ఆదేశాలతో ఇంద్రవెల్లి పీహెచ్‌సీ సిబ్బంది అవసరమైన పౌష్టికాహారాన్ని అందించారు. అంతే కాకుండా ప్రభుత్వ అధికారులు పాలిచ్చే ఆవును కొనుగోలు చేసి కుటుంబ సభ్యులకు అందించారు. దీంతో తండ్రి, తాత ఆనందంలో మునిగిపోయారు. తమ కష్టం తెలుసుకొని ఆవును కొనిచ్చిన మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై బిడ్డకు పాలు లేవనే బాధ ఉండదని వారు వ్యాఖ్యానించారు. కాగా, బిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే తమకు చెప్పాలని వైద్య సిబ్బంది వారికి సూచించారు. బిడ్డను బాగా చూసుకుంటామని, మంత్రి ఇచ్చిన ఆవును ఒక గొప్ప బహుమతిగా భావిస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు.

First Published:  23 March 2023 3:36 PM GMT
Next Story