Telugu Global
Telangana

రైతుబంధు వస్తుంది.. మీ ఫోన్లు టింగు టింగుమంటయి - హరీష్ రావు

సోమవారం కూడా బ్యాంకులకు సెలవే. దీంతో ఈనెల 28నే రైతుబంధు నిధులు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రైతుబంధు వస్తుంది.. మీ ఫోన్లు టింగు టింగుమంటయి - హరీష్ రావు
X

యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధుల విడుదలపై ప్రకటన చేశారు మంత్రి హరీష్‌ రావు. రైతుబంధు విడుదలకు ఈసీ అనుమతివ్వడంతో.. సోమవారం రైతుబంధు నిధుల విడుదల చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన హరీష్‌ రావు.. సోమవారం రైతుల ఫోన్లు టింగుటింగు మంటాయన్నారు. రైతుబంధు నిధుల విడుదలను ఆపాలంటూ కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందన్నారు. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడని చివరకు ధర్మమే గెలిచిందన్నారు.

అయితే సోమవారం కూడా బ్యాంకులకు సెలవే. దీంతో ఈనెల 28నే రైతుబంధు నిధులు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతించింది. దీంతో అదే రోజు రాత్రి భూపరిపాలన ప్రధాన కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఈ-కుబేర్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని అర్హులైన 70 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపింది. దీనికి అనుగుణంగా ట్రెజరీల నుంచి నిధులను బ్యాంకులకు విడుదల చేయాలి. తద్వారా రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయి.


శని, ఆది, సోమవారాలు వరుసగా సెలవులు రావడంతో ట్రెజరీలతో పాటు బ్యాంకులు పనిచేయడం లేదు. మంగళవారం మళ్లీ పనిదినం కావడంతో ఆ రోజు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటల లోపే అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు జ‌మ‌చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ కమిషనర్ తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియ ముగుస్తుందని స్పష్టంచేశారు. రైతుబంధు సాయం పంపిణీకి సంబంధించి రాష్ట్రంలోని ట్రెజరీ, వ్యవసాయాధికారులకు శనివారమే సమాచారం ఇచ్చామని తెలిపారు.

First Published:  26 Nov 2023 2:48 AM GMT
Next Story