Telugu Global
Telangana

పచ్చని తెలంగాణపై ఆంధ్రోళ్ల కన్నుపడింది

ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పి హాస్పిటల్ డ్రామాలు ఆడే డ్రామా ఆర్టిస్ట్ బండి సంజయ్ అని మండిపడ్డారు గంగుల. ప్రజలకు సేవ చేయమని ఎంపీగా ప్రజలు గెలిపిస్తే నాలుగున్నరేళ్లు పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు.

పచ్చని తెలంగాణపై ఆంధ్రోళ్ల కన్నుపడింది
X

పచ్చని తెలంగాణ పై ఆంధ్రోళ్ల కన్ను పడిందని, మరోసారి తెలంగాణపై ఆధిపత్యం కోసం కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు మంత్రి గంగుల కమలాకర్. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందన్నారు. 50 ఏళ్ల దరిద్రానికి కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలేనని.. యాభై ఏళ్ల దరిద్రం కోరుకుందామా, పదేళ్ల కేసీఆర్ అభివృద్ధి కోరుకుందామా అని ప్రశ్నించారాయన.

బండి డ్రామా ఆర్టిస్ట్..

ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పి హాస్పిటల్ డ్రామాలు ఆడే డ్రామా ఆర్టిస్ట్ బండి సంజయ్ అని మండిపడ్డారు గంగుల. ప్రజలకు సేవ చేయమని ఎంపీగా ప్రజలు గెలిపిస్తే నాలుగున్నరేళ్లు పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు మళ్లీ బండి వస్తున్నాడని ఆరోపించారు. ఎంపీగా ఈసారి బండికి టికెట్ ఇవ్వమని బీజేపీ అధిష్టానం చెప్పిందని, అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని అన్నారు. ఒక్క ఓటుకు రూ.20 వేలు, సెల్ ఫోన్ ఇస్తానని బండి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శించారు గంగుల. ఆయన ఇచ్చే డబ్బులు తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నాలుగున్నరేళ్లుగా ఎంపీగా సంజయ్ ఏం అభివృద్ధి చేశారో గ్రామాల్లో మహిళలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి గంగుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కరీంనగర్ లో గత కొన్నిరోజులుగా మంత్రి గంగుల, ఎంపీ బండి సంజయ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కరీంనగర్ లో ఎంఐఎంతో బీఆర్ఎస్ లాలూచీ పడిందని బండి ఆరోపించారు. అసలు గంగులకు టికెట్ ఇవ్వకూడదని కేసీఆర్ అనుకున్నారని కూడా చెప్పారు. గంగుల అవినీతిపరుడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు మంత్రి గంగుల కౌంటర్ ఇచ్చారు. ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు కనిపించకుండా పోయిన బండి, ఎన్నికలు రాగానే ఇప్పుడు డబ్బు మూటలతో దిగిపోయారని మండిపడ్డారు. బండి ఓడిపోవడం ఖాయమన్నారు గంగుల.


First Published:  20 Nov 2023 8:19 AM GMT
Next Story