Telugu Global
Telangana

సోదాల్లో ఏం దొరికిందో ఎంత దొరికిందో చెప్పాల్సిందే -గంగుల

మునుగోడులో టీఆర్‌ఎస్‌ సాధించిన విజయం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ మండిపడ్డారు.

సోదాల్లో ఏం దొరికిందో ఎంత దొరికిందో చెప్పాల్సిందే -గంగుల
X

తన ఇంట్లో జరిగిన సోదాల్లో ఏం దొరికిందో, ఎంత దొరికిందో దర్యాప్తు సంస్థలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారాయన. ఆయన విదేశాల్లో ఉండగా ఇక్కడ సోదాలు మొదలయ్యాయి. ఆయన ఇంటికి ఈడీ అధికారులు వచ్చారు. మంత్రి గంగులకు వీడియో కాల్ చేసి ఇంటి తాళాలు అడిగారు. ఈడీ అధికారులకు తాను పూర్తిగా సహకరించానని, తన ఇంట్లో ప్రతి లాకర్ ఓపెన్ చేసుకుని చూడాలని చెప్పానని అంటున్నారు గంగుల. దాడుల వార్తల అనంతరం ఆయన హుటాహుటిన భారత్ కు తిరిగొచ్చారు. అధికారులకు సహకరించేందుకే తాను తిరిగొచ్చానని చెప్పారు గంగుల. ఈ సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు చెప్పాలని కోరారు.

మైనింగ్‌, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయన్నారు గంగుల కమలాకర్. ఇతర దేశాల నుంచి వచ్చిన హవాలా సొమ్ము ఈడీ తేల్చాలని, నగదు అక్రమంగా నిల్వ ఉంచితే ఆ వ్యవహారం ఐటీ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇలాంటి వాటికి సంబంధించి తమ సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. గతంలో కూడా చాలా మంది ఈడీ, ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారని, అప్పుడు కూడా ఏమీ తేలలేదని, ఇప్పుడు కూడా ఈడీ, ఐటీ తేల్చడానికి ఏమీ లేదన్నారు.

హైదరాబాద్‌, కరీంనగర్ లో ఏకకాలంలో ఐటీ, ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మంత్రి గంగులతో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. అయితే ఇప్పటి వరకూ దీనిపై అధికారులు వివరాలు వెల్లడించలేదు. అధికారులకు సహకరించేందుకే తాను తిరిగొచ్చానంటున్న గంగుల, 30 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారంలో ఉన్నామని, గతంలో కూడా చాలామంది ఆరోపణలు చేశారని, కానీ, ఏవీ రుజువు కాలేదని చెప్పారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ సాధించిన విజయం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ మండిపడ్డారు.

First Published:  10 Nov 2022 2:04 AM GMT
Next Story