Telugu Global
Telangana

బీఆర్ఎస్ నేత గుండె పోటుతో మృతి.. పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మంత్రి దయాకర్ రావు వెంటనే రోడ్డు మార్గంలో కొండూరు గ్రామానికి చేరుకున్నారు.రామస్వామితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు.

బీఆర్ఎస్ నేత గుండె పోటుతో మృతి.. పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

ఎన్నో ఏళ్లుగా తన వెంట నడిచిన బీఆర్ఎస్ నేత చనిపోవడాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జీర్ణించుకోలేక పోయారు. హైదరాబాద్‌లో ఉన్న మంత్రి దయాకర్ రావు హుటాహుటిన వెళ్లి స్వయంగా అంత్రక్రియల్లో పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని కొండూరుకు చెందిన బీఆర్ఎస్ నేత, వర్దన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండె రామస్వామి సోమవారం ఉదయం హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న దయాకర్ రావుకు తెలియజేశారు.

మంత్రి దయాకర్ రావు వెంటనే రోడ్డు మార్గంలో కొండూరు గ్రామానికి చేరుకున్నారు.రామస్వామితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. ఆయన మరణం తనకు తీరని లోటని ఎర్రబెల్లి భావోద్వేగంగా మాట్లాడారు. అంత్యక్రియల్లో పాల్గొని, రామస్వామి పాడెను మంత్రి ఎర్రబెల్లి మోశారు. ఈ సందర్భంగా రామస్వామికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామస్వామి కుమారుడు, తొర్రూరు మున్సిపాలిటీ మాజీ కమిషనర్ గుండె బాబును ఆయన ఓదార్చారు. రామస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు.

ఇక ఇవ్వాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంత్రి ఎర్రబెల్లి ప్రశంసలు కురిపించారు. తాను నిర్వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖకు రూ.34,426 కేటాయించడంపై ఆయన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఆసరా పెన్షన్లకు రూ.12వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.600 కోట్లు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పల్లెలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన సంగతిని, జాతీయ స్థాయిలో 9 పంచాయతీలు అవార్డులు గెలచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

First Published:  6 Feb 2023 2:49 PM GMT
Next Story