Telugu Global
Telangana

తెలంగాణలో విస్తరించేందుకు ఎంఐఎం వినూత్న వ్యూహం !

తెలంగాణలో బలపడేందుకు ఎంఐఎం ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముస్లిం ప్రాబ‌ల్యం ఉన్న స్థానాలతో పాటు కొన్ని వెనుకబడిన తరగతులకు రిజర్వ్ అయిన అసెంబ్లీ నియోజకవర్గాల నుండి హిందూ అభ్యర్థులను పోటీకి దింపేందుకు ప్రణాళికలు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణలో విస్తరించేందుకు ఎంఐఎం వినూత్న వ్యూహం !
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఇప్ప‌టినుంచే స‌న్నాహాలు ప్రారంభించింది. ఈ సారి ఎన్నిక‌ల్లో ఆపార్టీ వినూత్న వ్యూహాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. త‌మ సామాజిక వ‌ర్గంత పాటు ఇత‌ర హిందూ వ‌ర్గాల‌ను కూడా కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా 50 స్థానాల‌లో బరిలో దిగాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

ముస్లిం ప్రాబ‌ల్యం ఉన్న స్థానాలతో పాటు కొన్ని వెనుకబడిన తరగతులకు రిజర్వ్ అయిన అసెంబ్లీ నియోజకవర్గాల నుండి హిందూ అభ్యర్థులను పోటీకి దింపేందుకు ప్రణాళికలు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వివిధ జిల్లాలు, న‌గ‌ర‌ శివారు ప్రాంతాలలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాలను ప‌రిశీలిస్తున్నారు. జిల్లాల్లో ఇప్పటి వరకు 17 అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం జిల్లాల వారీగా స‌మీక్ష‌లు చేస్తున్నారు. నిజామాబాద్ (అర్బన్), సంగారెడ్డి, కరీంనగర్, బోధన్, కామారెడ్డి, నిర్మల్, ముధోలే, ఆదిలాబాద్, కాగజ్ నగర్, కోరుట్ల, భోంగీర్, వరంగల్ (తూర్పు), మెహబూబ్ నగర్, ఖమ్మం, జహీరాబాద్, వికారాబాద్, షాద్ నగర్ సహా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌పై సమీక్షిస్తున్నారు.

గుర్తించిన నియోజ‌క వ‌ర్గాల్లో ఇన్ చార్జిల‌ను నియ‌మించి పార్టీ విస్త‌ర‌ణ‌కు, కేడ‌ర్ ప‌టిష్ట‌త‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కొంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను పార్టీలో చేర్చుకుని ఎన్నికల రంగంలోకి దించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. క్షేత్ర స్థాయిలో గుర్తించిన ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాల‌ని, తాము ఏ వ‌ర్గానికీ వ్య‌తిరేకం కాద‌నే భావ‌న‌ను ప్ర‌జ‌ల్లో క‌ల్పించాల‌ని అధినేత జిల్లాల స‌మీక్ష‌ల్లో చెబుతున్నారుట‌.

అలాగే ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చి ప‌రిష్కారానికి ప‌నిచేయాల‌ని అధినేత పార్టీ శ్రేణుల‌కు ఉద్బోధిస్తున్నారు. ఇందుకోసం ఖ‌చ్చిత‌మైన ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

First Published:  23 Oct 2022 4:29 PM GMT
Next Story