Telugu Global
Telangana

గుజరాత్ ఎన్నికల కోసమే రేపిస్టుల విడుదల.. మోదీపై అసదుద్దీన్ ఒవైసీ మండిపాటు

గుజరాత్ మత దాడుల సమయంలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆరుగురిని హత్య చేసిన నేరస్తులను గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదలచేయడాన్ని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. గుజరాత్ ఎన్నికల కోసమే రేపిస్టులను వదిలిపెట్టారని ఆయన ఆరోపించారు.

గుజరాత్ ఎన్నికల కోసమే రేపిస్టుల విడుదల.. మోదీపై అసదుద్దీన్ ఒవైసీ మండిపాటు
X

గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితులను జైలు నుంచి విడుదల చేశారని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆ రాష్ట్ర ఎన్నికల ముందు ఇది బుజ్జగింపు రాజకీయాలు తప్ప మరేమీ కాదన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై నుంచి మీరు మహిళలకు మరిన్ని అధికారాలు రావాలని కబుర్లు చెప్పారని, కానీ చేసిందేమిటని ఆయన ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఇది అత్యంత దురదృష్టకరం.. ముస్లిములకు తప్పుడు సంకేతాలు వెళ్లడమే కాదు.. ఇది మీ తప్పుడు విధానం కూడా అన్నారు. ఓ మతంవారిపట్ల మీ పార్టీ పూర్తిగా పక్షపాత ధోరణిని చూపుతోందని, గోధ్రా జైల్లో ఉన్న ఆ నిందితులకు చట్టమంటే లెక్క లేదని ఒవైసీ మండిపడ్డారు. కనీసం వారిలో పశ్చాత్తాపం కూడా లేదు.. మళ్ళీ నేరాలు చేయడానికి వెనుకాడరు అని వ్యాఖ్యానించారు.

ఈ సంవత్సరాంతంలో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో వరుసగా ఆరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ తహతహలాడుతోంది. ఆజాదీకా మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహిస్తున్న వేళ.. స్పెషల్ రిలీజ్ పాలసీ కింద రేపిస్టులను జైళ్ల నుంచి విడుదల చేయరాదని కేంద్రం గత జూన్ లో ప్రకటించింది. కానీ ఈ కేసులో ఆ గైడ్ లైన్స్ ని పాటించినట్టు కనబడలేదు. ఇది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలన్న యోచన తప్ప మరేమీ కాదని ఒవైసీ నిప్పులు చెరిగారు. ఈ రేపిస్థుల విడుదల... గాయాలపై ఉప్పు రుద్దినట్టు ఉంది.. మోడీ అమృత్ ఉత్సవం అంటే ఇదేనా అని ఓవైసీ ప్రశ్నించారు. ఈ కేసును పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించిందే తప్ప దోషులను విడుదల చేయాలని కాదు అని ఒవైసీ చెప్పారు. బీజేపీ చూపుతున్న పక్షపాతం చూస్తే.. కిరాతకంగా రేప్ చేసినవారిని కూడా క్షమించి వదిలెయ్యాలన్నట్టు ఉంది.. ఈ కేసులో నిందితుల రిలీజ్ ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్ ప్రభుత్వం పాటించిన క్షమాభిక్ష పాలసీనే ఉపసంహరించాలన్నారు.

కాగా సుప్రీంకోర్టు ఆదేశాలపై గుజరాత్ ప్రభుత్వం .. క్షమాభిక్ష పాలసీ అంటూ 11 మంది నిందితులను గోధ్రా జైలు నుంచి రిలీజ్ చేసింది. 2002 లో గోద్రా అల్లర్ల అనంతరం జరిగిన దారుణాల్లో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుల్లో 11 మందికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అయితే వీరిలో ఒకడు తమకు క్షమాభిక్ష పెట్టాలంటూ సుప్రీంకోర్టుకెక్కాడు. దీనిపై గుజరాత్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు రూలింగ్ ఇవ్వగా.. ఆ మాట పట్టుకొని ప్రభుత్వం వీరిని వదిలేసింది.





First Published:  16 Aug 2022 2:54 PM GMT
Next Story