Telugu Global
Telangana

ప్రతిపక్షంగా ఉంటాం.. అభివృద్ధికి సహకరిస్తాం

గత ప్రభుత్వం ఉర్దూకు తగిన ప్రాధాన్యత ఇచ్చిందని, అందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు అక్బరుద్దీన్. కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో ఉర్దూకు ప్రాధాన్యత తగ్గిందన్నారు.

ప్రతిపక్షంగా ఉంటాం.. అభివృద్ధికి సహకరిస్తాం
X

అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు MIM లీడర్‌ అక్బరుద్దీన్ ఓవైసీ. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయాయన్నారు. MIM పార్టీ ముస్లింల కోసం పోరాడుతూనే ఉంటుందన్నారు.

గత ప్రభుత్వం ఉర్దూకు తగిన ప్రాధాన్యత ఇచ్చిందని, అందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు అక్బరుద్దీన్. కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో ఉర్దూకు ప్రాధాన్యత తగ్గిందన్నారు. మేనిఫెస్టోలో ఆ అంశాన్ని కూడా కాంగ్రెస్‌ ప్రస్తావించలేదని గుర్తుచేశారు. ఉర్దూకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కేవలం డీఎస్సీ మాత్రమే కాదు.. ఇతర పరీక్షలు సైతం ఉర్దూలో నిర్వహించాలని కోరారు. మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. మైనార్టీ సబ్‌ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్న హామీలను గుర్తుచేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఎన్నికల ప్రచారంలో పదే పదే కాంగ్రెస్ గుర్తుచేసిందని, కానీ మేనిఫెస్టోలో మాత్రం పెట్టలేదన్నారు. బీఆర్ఎస్ ఎలాగూ 12 శాతం రిజర్వేషన్‌ ఇవ్వలేదని, కాంగ్రెస్‌ పార్టీ ఇస్తుందో, లేదో చెప్పాలని డిమాండ్ విసిరారు. కర్ణాటక, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుగా తెలంగాణలో వ్యవహరించొద్దని కోరారు అక్బరుద్దీన్.

పాతబస్తీలో అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలన్నారు అక్బరుద్దీన్. మూసీ ప్రక్షాళన, పాతబస్తీలో పాదాచారులకు ప్రత్యేక దారులు, చార్మినార్‌ పరిసర ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్నారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్‌, కేసీఆర్‌ పాత్రను తక్కువ చేయలేమన్నారు అక్బరుద్దీన్. ఎలక్షన్ మోడ్‌ నుంచి కాంగ్రెస్ బయటకు రావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి కృషిచేద్దామన్నారు.

First Published:  16 Dec 2023 8:31 AM GMT
Next Story