Telugu Global
Telangana

రాజకీయాల్లోకి ఓవైసీల వారసుడు.. ఆ స్థానం నుంచే పోటీ.!

నూరుద్దీన్‌ను 2018లోనే రాజకీయాల్లోకి తీసుకురావాలని ఓవైసీ సోదరులు భావించినప్పటికీ.. వయసు సరిపోకపోవడంతో వెనక్కి తగ్గారు. దీంతో నూరుద్దీన్ ఈసారి కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తోంది.

రాజకీయాల్లోకి ఓవైసీల వారసుడు.. ఆ స్థానం నుంచే పోటీ.!
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓల్డ్‌ సిటీ నుంచి మరో వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ కుమారుడు నూరుద్దీన్ ఓవైసీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది.

ఈసారి 9 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు MIM చీఫ్‌ అసదుద్దీన్ ఓవైసీ. ఆరు స్థానాల్లో అభ్యర్థులను సైతం ఫైనల్ చేశారు. బహదూర్‌పురా, జూబ్లిహిల్స్‌, రాజేంద్రనగర్‌ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. బహదూర్‌పురా నుంచి నూరుద్దీన్ ఓవైసీని పోటీలో ఉంచుతారని ప్రచారం జరుగుతోంది. మొదటగా చార్మినార్‌ నుంచి నూరుద్దీన్‌ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. చార్మినార్‌ అసెంబ్లీ స్థానం నుంచి నూరుద్దీన్ తాత సలావుద్దీన్ ఓవైసీ, పెదనాన్న అసదుద్దీన్‌ ఓవైసీ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. చార్మినార్‌ అసెంబ్లీ స్థానం దాదాపు 40 ఏళ్లుగా MIM ఆధీనంలోనే ఉంది. అయితే తాజా లిస్టులో చార్మినార్‌ నుంచి జుల్ఫికర్‌కు అవకాశం ఇచ్చింది MIM. దీంతో బహదూర్‌పురా నుంచే నూరుద్దీన్ పోటీ చేసే అవకాశాలున్నాయి.

నూరుద్దీన్‌ను 2018లోనే రాజకీయాల్లోకి తీసుకురావాలని ఓవైసీ సోదరులు భావించినప్పటికీ.. వయసు సరిపోకపోవడంతో వెనక్కి తగ్గారు. దీంతో నూరుద్దీన్ ఈసారి కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తోంది. MBBS పూర్తి చేసిన నూరుద్దీన్.. ప్రస్తుతం సాలార్‌-ఎ-మిల్లత్‌ ఎడ్యూకేషనల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా, సెక్రటరీగా ఉన్నారు.

నూరుద్దీన్ ఓవైసీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. దాదాపు ఓవైసీ ఫ్యామిలీ నుంచి నాలుగో తరం పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చినట్లవుతుంది. 1957లో అసదుద్దీన్ ఓవైసీ తాత అబ్దుల్ వహీద్ ఓవైసీ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత 1975లో అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ రాజకీయాల్లోకి వచ్చారు. ఇక 2008లో అసదుద్దీన్ ఓవైసీ MIM పార్టీకి మూడో అధ్యక్షుడయ్యారు. అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రస్తుతం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు.

First Published:  4 Nov 2023 5:11 AM GMT
Next Story