Telugu Global
Telangana

ఖాసీం రిజ్వీ వారసత్వానికి ఎంఐఎం కొనసాగింపు కాదు : అసదుద్దీన్ ఒవైసీ

అసత్యాలను ప్రచారం చేస్తూ ముస్లిం, హిందువుల మధ్య సమస్యలు సృష్టించవద్దని, తాము రిజ్వీకి వారసులం కానే కాదని ఒవైసీ స్పష్టం చేశారు. మా దేశభక్తి, నిబద్దత గురించి బీజేపీ-ఆర్ఎస్ఎస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

ఖాసీం రిజ్వీ వారసత్వానికి ఎంఐఎం కొనసాగింపు కాదు : అసదుద్దీన్ ఒవైసీ
X

భారత స్వాతంత్ర పోరాట యోధులు తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్‌ల వారసత్వాన్ని ఎంఐఎం కొనసాగిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పునరుద్ఘాటించారు. ఖాసీం రిజ్వీకి తాము వారసులమని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఒవైసీ మాట్లాడుతూ.. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 1857లో చేసిన సిపాయిల తిరుగుబాటులో తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ తమ ప్రాణాలను త్యాగం చేశారని.. కానీ ఖాసీం రిజ్వీ రజాకార్లకు నాయకుడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఒవైసీ చెప్పారు.

ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తూ ముస్లిం, హిందువుల మధ్య సమస్యలు సృష్టించవద్దని, తాము రిజ్వీకి వారసులం కానే కాదని ఒవైసీ స్పష్టం చేశారు. భారత స్వాతంత్ర పోరాటంలో ఒక్క చెమట చుక్క కూడా రాల్చని వ్యక్తులు ఇవ్వాల విమోచన దినమంటూ సంబరాలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. మా దేశభక్తి, నిబద్దత గురించి బీజేపీ-ఆర్ఎస్ఎస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. మీరిచ్చే ధ్రువీకరణ పత్రాలు చెత్తబుట్టలో వేయడానికే పనికొస్తాయని ఆయన చెప్పారు. జమ్ము కశ్మీర్‌లోని ముస్లింలపై అరాచకాలు చేశారని స్వయంగా మహాత్మా గాంధీ చెప్పిన రాజా హరి సింగ్‌ పుట్టిన రోజును సెలవు దినంగా ఎలా ప్రకటిస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. కశ్మీర్ చివరి రాజుగా ఆయన చేసిన అఘాయిత్యాలు అందరికీ తెలుసని అన్నారు.

గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పని చేసిన సి. రాజగోపాలాచారి సెప్టెంబర్ 17ను జాతీయ కృతజ్ఞతా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పారని, ఈ విషయాన్ని 'విమోచన దినంగా' పాటిస్తున్న వాళ్లు గుర్తుంచుకోవాలని ఒవైసీ అన్నారు. ఆపరేషన్ పోలో సందర్భంగా 40 వేల మంది ముస్లింలు చనిపోయిన విషయాన్ని అనేక నివేదికలు వెల్లడించినట్లు ఒవైసీ తెలిపారు. ఆనాడు అనేక మంది ముస్లింలను హిందువులు తమ ఇళ్లలో దాచి పెట్టి ప్రాణాలు కాపాడారని ఆయన కొనియాడారు. ఈనాటి యువత టిక్ టాక్‌లు చూసే బదులు చరిత్ర చదువుకొని నిజాలు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.

జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా చాంద్రాయణగుట్టలోని మజీద్ ఏ అబుబకర్ నుంచి ఎంఐఎం ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తేగలకుంట వద్ద ప్రార్థనలు నిర్వహించారు.

First Published:  17 Sep 2022 4:29 AM GMT
Next Story