Telugu Global
Telangana

‘హను–మాన్‌’ ప్రతి టికెట్‌పై రూ.5 రామమందిరానికే..

ఆంజనేయుడిని పూజిస్తూ క్రమశిక్షణతో, నిబద్ధతతో ఈ స్థాయికి వచ్చానని వివరించారు. తాను ఏడో తరగతి చదువుతుండగా, పొన్నూరులో ఆంజనేయస్వామి గుడికి వెళ్లి నమస్కారం చేసుకుని వచ్చేవాడినని చెప్పారు.

‘హను–మాన్‌’ ప్రతి టికెట్‌పై రూ.5 రామమందిరానికే..
X

సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులను అలరించేందుకు జనవరి 12న థియేటర్లలోకి వస్తున్న ‘హను–మాన్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం. ఈ కార్యక్రమానికి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన చిరంజీవి ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర బృందం తీసుకున్న కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తమ సినిమా ప్రతి టికెట్‌ ధరలో రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుందని ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రబృందం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఈవెంట్‌కి అందుకే వచ్చా...

‘హను–మాన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరుకావడానికి గల కారణాలను ఈ సందర్భంగా చిరు వివరించారు. ఈ ఈవెంట్‌కు రావడంలో ప్రధానంగా హనుమంతుడిని ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన సినిమా కావడం.. డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్‌లు ఎక్కే స్టేజ్‌కి వచ్చిన తేజ సజ్జా మరో కారణమని వివరించారు. ట్రైలర్‌ చూసినపుడు ప్రతి సన్నివేశంలో ఫ్రెష్‌నెస్‌ కనిపించిందని చెప్పారు. తన ఆరాధ్య దైవం, అమ్మానాన్నల తర్వాత అనుక్షణం ప్రార్థించేది ఆంజనేయ స్వామినేనని తెలిపారు. తాను కొలిచే హనుమంతుడి గురించి బయట ఎక్కడా చెప్పుకోలేదన్నారు. ఇలాంటి వేదికపై హనుమాన్‌ గురించి కచ్చితంగా చెప్పాలని, అందుకే ఈ ఈవెంట్‌కు రమ్మని కోరగానే మరో ఆలోచన లేకుండా వచ్చేశానని తెలిపారు. ఆంజనేయుడిని పూజిస్తూ క్రమశిక్షణతో, నిబద్ధతతో ఈ స్థాయికి వచ్చానని వివరించారు. తాను ఏడో తరగతి చదువుతుండగా, పొన్నూరులో ఆంజనేయస్వామి గుడికి వెళ్లి నమస్కారం చేసుకుని వచ్చేవాడినని చెప్పారు. ఒకసారి లాటరీలోనూ ఆ స్వామి ఫొటో వచ్చిందని, దాన్ని ఫ్రేమ్‌ కట్టి.. ఇప్పటికీ పూజిస్తున్నానని వివరించారు. విజయం మీదే అంటూ ఈ సందర్భంగా చిత్ర బృందానికి చెప్పిన చిరంజీవి.. అయోధ్య రామమందిరానికి చేస్తున్న సాయం అభినందనీయమని చెప్పారు.

ఎప్పటికీ రుణపడి ఉంటా...

తమ ఈవెంట్‌కు వచ్చి తమకు అండగా నిలిచిన చిరంజీవికి ఎప్పటికీ రుణపడి ఉంటానని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చెప్పారు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. సినిమా అనేది ఒక యుద్ధమని, అవకాశం రావడం, మూవీ తీయడం ఒకెత్తయితే, చివరిగా రిలీజ్‌ చేయడం ఇంకా పెద్ద యుద్ధమని తెలిపారు. ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కరి వెనుక హనుమంతుడు ఉంటాడు.. అని తమ సినిమాలో ఒక డైలాగ్‌ ఉందని, అలా తమ సినిమాకు అండగా నిలబడినవారు చిరంజీవి అని కృతజ్ఞతలు తెలియజేశారు.

First Published:  8 Jan 2024 2:51 AM GMT
Next Story