Telugu Global
Telangana

కాంగ్రెస్‌కు తలనొప్పిగా మెదక్ సీటు..!

మెదక్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు మెదక్ పార్లమెంట్ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌కు తలనొప్పిగా మెదక్ సీటు..!
X

మెదక్‌ పార్లమెంట్ స్థానానికి సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్ త‌ర‌ఫున‌ మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, బీజేపీ త‌ర‌ఫున మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బరిలో నిలిచారు. దీంతో కాంగ్రెస్‌ సైతం బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైమ్‌లో మెదక్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో సత్తా చాటిన కాంగ్రెస్‌.. క్రమంగా ఆ స్థానంపై పట్టు కోల్పోయింది. 1980 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రెండు లక్షల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి భాగారెడ్డి సైతం 1989 నుంచి 98 వరకు ఎంపీగా కొన‌సాగారు. తర్వాత మెదక్‌లో కాంగ్రెస్‌ ప్రభ తగ్గుతూ వచ్చింది.

మెదక్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవక దాదాపు 26 ఏళ్లు గడిచిపోయింది. 1999లో బీజేపీ అభ్యర్థిగా ఆలె నరేంద్ర విజయం సాధించారు. తర్వాత ఆయన అప్పటి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2004లో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన నరేంద్ర యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. 2009లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయశాంతి విజయం సాధించగా.. 2014లో కేసీఆర్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ఎంపీకి రాజీనామా చేశారు. దీంతో జరిగిన ఉపఎన్నికతో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ పరిధిలోని నియోజకవర్గాల్లో సత్తా చాటింది. మొత్తం 7 నియోజకవర్గాలకుగానూ 6 నియోజకవర్గాలను గెలుచుకుంది.

ఇక మెదక్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు మెదక్ పార్లమెంట్ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూతురు త్రిష పేరు తెరపైకి వచ్చింది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి పేరు కూడా వినిపించినప్పటికీ.. ఆమెకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్‌ పదవి కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావు పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం మైనంపల్లి కుమారుడు మైనంపల్లి రోహిత్‌ మెదక్ ఎమ్మెల్యేగా గెలిచారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌ గెలిచిన ఏకైక సీటు ఇదే.

First Published:  26 March 2024 5:40 AM GMT
Next Story