Telugu Global
Telangana

మెదక్ కాంగ్రెస్ లో మైనంపల్లి ముసలం..

పదేళ్లుగా బీఆర్ఎస్ ని ఎదుర్కొని పోరాటాలు చేశామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు.

మెదక్ కాంగ్రెస్ లో మైనంపల్లి ముసలం..
X

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ కోసం 12మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. వారందర్నీ కాదని, ఇప్పటికిప్పుడు పార్టీ కండువా కప్పుకున్న మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్ కి ఆ టికెట్ ఖరారు చేసినట్టు ప్రకటించింది పార్టీ. దీంతో మెదక్ కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. పార్టీకోసం పనిచేస్తున్నవారిని పక్కనపెట్టి, ఫిరాయింపుదారులకు పెద్దపీట వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు నాయకులు. మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడం అధిష్టానం ఇష్టమని, అయితే ఆ రెండో టికెట్.. మెదక్ మాత్రం కాకూడదని చెబుతున్నారు.

అసంతృప్తులకు ఢిల్లీనుంచి పిలుపు..

పదేళ్లుగా బీఆర్ఎస్ ని ఎదుర్కొని పోరాటాలు చేశామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. మెదక్ డీసీసీ అధ్యక్షుడికి ఢిల్లీనుంచి పిలుపు రావడంతో ఆయన హడావిడిగా బయలుదేరి వెళ్లారు. మరి మిగతావారిని అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.

మైనంపల్లితోనే తంటా..

మైనంపల్లి టికెట్ల వ్యవహారంలో సూట్ కేసులు చేతులు మారాయంటూ ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రెండు టికెట్ల విషయంలో గాంధీ భవన్ లో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడమేంటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అది కూడా అప్పటికే ఆశలు పెట్టుకున్న 12మందిని కాదని, మైనంపల్లి తనయుడికి తొలిసారి పోటీ చేసే అవకాశం ఇస్తున్నందుకు అందరూ నొచ్చుకుంటున్నారు. పార్టీ వీడిపోతామని చెప్పడంలేదు కానీ, తిరుగుబాటు చేసే ఆలోచనలో స్థానిక నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అలాంటి వారిని బుజ్జగించి, దగ్గరకు తీసుకుని, సంతృప్తి పరచడంలో మైనంపల్లి అందెవేసిన చేయి అంటున్నారు కొంతమంది. ఈ హడావిడి, అసంతృప్త జ్వాలలు త్వరలోనే తగ్గిపోతాయని చెబుతున్నారు. అప్పటి వరకు మెదక్ కాంగ్రెస్ లో అలజడి మాత్రం తగ్గేలా లేదు.

First Published:  29 Sep 2023 3:16 AM GMT
Next Story