Telugu Global
Telangana

షాపింగ్ మాల్‌‍లో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం

రాత్రంతా ఏకధాటిగా శ్రమించగా గురువారం తెల్లవారుజామున మంటలు కొంతవరకు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో రూ.8 నుంచి రూ.10 కోట్లు విలువచేసే దుస్తులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

షాపింగ్ మాల్‌‍లో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం
X

కామారెడ్డిలోని అయ్యప్ప షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మాల్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే ఐదంతస్తుల భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. మంట‌లు ఆర్పేందుకు మూడు ఫైరింజన్లతో.. సుమారు మూడు గంటల పాటు ప్రయత్నం చేసినా అవి అదుపులోకి రాలేదు. హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీమ్‌ను తెప్పించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో షాపింగ్ మాల్ లోని షట్టర్లను తొలగించి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేసారు.



రాత్రంతా ఏకధాటిగా శ్రమించగా గురువారం తెల్లవారుజామున మంటలు కొంతవరకు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో రూ.8 నుంచి రూ.10 కోట్లు విలువచేసే దుస్తులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్‌తో జరిగిందా..? లేక ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహదారులను బ్లాక్ చేశారు. పరిసరాల్లో ఉన్న షాపు యజమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు. మంటలు విపరీతంగా ఎగిసిపడటంతో షాపింగ్ మాల్ ప‌క్కనే ఉన్న ప్రైవేట్ ఆస్ప‌త్రిని అధికారులు ఖాళీ చేయించారు. పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయి.

First Published:  14 Dec 2023 6:05 AM GMT
Next Story