Telugu Global
Telangana

మెట్రో భారీ విస్తరణ సాధ్యమే.. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు : మంత్రి కేటీఆర్

మెట్రో భారీ విస్తరణ ప్రకటించగానే.. అది సాధ్యమవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని.. కేసీఆర్ తలుచుకున్నారు.. అది పూర్తవుతుందని కేటీఆర్ అన్నారు.

మెట్రో భారీ విస్తరణ సాధ్యమే.. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు : మంత్రి కేటీఆర్
X

మనం ఏదైనా భారీ పని తలపెట్టినప్పుడు చాలా మంది అది అవుతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తారు. సీఎం కేసీఆర్ తెలంగాణ తీసుకొని వస్తా అన్నప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో కూడా చాలా మంది అలాగే అనుకొని ఉంటారు. కానీ కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ గురించి చెప్పినప్పుడు కూడా పూర్తవుతుందా అని వ్యాఖ్యానించారు. ఆ రెండింటినీ తక్కువ కాలంలోనే పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ఇప్పుడు మెట్రో భారీ విస్తరణ ప్రకటించగానే.. అది సాధ్యమవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని.. కేసీఆర్ తలుచుకున్నారు.. అది పూర్తవుతుందని కేటీఆర్ చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీవో నంబర్ 118 కింద రెగ్యులరైజ్ అయిన వారికి భూమి పట్టాలను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..

హైదరాబాద్ నగరంలో జీవో నెంబర్ 58,59 కింద లక్ష పైచిలుకు కుటుంబాలకు పట్టాలు వస్తే.. ఒక్క ఎల్బీనగర్‌లోనే 11 వేల మందికి పైగా లబ్దిదారులు ఉన్నారని చెప్పారు. మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చాలా ఘటికుడు. ఆనాడు నేనే స్వయంగా బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించాను. అప్పుడు జీవో 118 సమస్యను పరిష్కరిస్తేనే పార్టీలో చేరతానని పట్టుబట్టారు. అప్పటి నుంచి నిత్యం మమ్మల్ని అదే విషయంపై అడుగుతూ ఉండేవారు. చివరకు ఆయన అనుకున్నది సాధించారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీవో నెంబర్ 118, 58, 59 ద్వారా పట్టాలు అందాయి. అలాగే నాలుగు వేల మందికి డబుల్ బెడ్రూమ్‌లు రానున్నాయి. గృహ లక్ష్మి పథకం ద్వారా మరో మూడు వేల మందికి రూ.3 లక్షల చొప్పున లబ్ది చేకూరనున్నదని కేటీఆర్ చెప్పారు. గత 9 ఏళ్లలో ఎల్బీనగర్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని.. ఫ్లైవోవర్లు, అండర్ పాస్‌లతో ట్రాఫిక్ రద్దీ తగ్గిందని చెప్పారు. నీటి సమస్య, కరెంటు కోతలు కూడా లేవని అన్నారు. త్వరలోనే గడ్డిఅన్నారంలో 2వేల పడకల టిమ్స్ ఆసుపత్రి రాబోతోంది. అలాగే నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రోను వెంటనే చేపడతాము. ఎల్బీనగర్ నుంచి పెద అంబర్ పేట్ వరకు కూడా మెట్రోను ప్రతిపాదించామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లోని డబుల్ బెడ్రూం లబ్దిదారులకు అగస్టు 15 నుంచి ఇళ్ల పంపిణీ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ జిల్లాకొక మెడికల్ కాలేజీ ఉండాలని నిర్ణయించారు. ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. ఇక మిగిలిన 8 జిల్లాలకు మెడికల్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో రంగారెడ్డి జిల్లాకు కందుకూరులో మెడికల్ కాలేజీ రాబోతోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇది ఎల్బీనగర్ ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆర్నెళ్ల పాటు రాజకీయం చేస్తే చాలు. మిగిలిన నాలుగున్నరేళ్లు ప్రజల కోసం పని చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోంది. తప్పకుండా ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారు. ఇవ్వాల మెట్రో కోసం భారీ ప్రతిపాదనలు చేశాము. ఎందుకంటే తప్పకుండా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఆధ్వర్యంలోనే మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము. దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా తప్పకుండా రికార్డు సృష్టిస్తారని మంత్రి కేటీఆర్ ధీమాగా చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలో మన హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

First Published:  2 Aug 2023 7:30 AM GMT
Next Story