Telugu Global
Telangana

నిధులు దారి మళ్లాయి.. కానీ ఎక్కడికో నాకు తెలియదు- శైలజాకిరణ్

నిధుల మళ్లింపుపైనా సీఐడీ అధికారులు ఎక్కువగా ప్రశ్నించారు. దాంతో ఏపీలోని 37 బ్రాంచ్‌ల నుంచి వచ్చిన డబ్బును ఇతర సంస్థల్లో పెట్టుబడిగా పెట్టినట్టు ఆమె అంగీకరించినట్టు సమాచారం.

నిధులు దారి మళ్లాయి.. కానీ ఎక్కడికో నాకు తెలియదు- శైలజాకిరణ్
X

మార్గదర్శి అక్రమాల వ్యవహారంపై సీఐడీ విచారణలో ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ సరైన సమాధానం చెప్పలేకపోయారు. నిధుల దారి మళ్లింపుపై అధికారులు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో ఒక దశలో ఆమె నిధులు దారి మళ్లిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ, ఆ నిధులు ఎక్కడికి మళ్లించారో తనకు తెలియదంటూ దాటవేశారు.

విచారించేందుకు తన ఇంటికి వచ్చిన సీఐడీ అధికారులను అరగంట పాటు రోడ్డు మీదే గేటు బయటే నిలబెట్టారు. ఆ తర్వాత విచారణ సమయంలోనూ ఆమె తనకు అనారోగ్యంగా ఉందని తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు విచారణ సాగింది. ''సంస్థకు ఎండీగా ఉన్న మీ పేరు మీదే చెక్ పవర్‌ ఉంది.. నిధులు మళ్లించారు అన్న దానికి ఇదే ఆధారాలు'' అంటూ అధికారులు కొన్ని డాక్యుమెంట్లను ముందుంచగా '' నాకు హెల్త్ సరిగా లేదు. నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. ఇబ్బంది పెట్టొద్దు'' అంటూ విజ్ఞప్తి చేశారు. తాను అమెరికా వెళ్లి వచ్చానని అప్పటి నుంచి జర్వంగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయంటూ గదిలోకి వెళ్లేందుకు సిద్ధమవగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించి కొన్ని మందులు ఇచ్చారు. ఆ తర్వాత విచారణ కొనసాగించారు.

శైలజాకిరణ్ విచారణ మొత్తం వీడియో కెమెరాల్లో రికార్టు చేశారు. నిధుల మళ్లింపుపైనా సీఐడీ అధికారులు ఎక్కువగా ప్రశ్నించారు. దాంతో ఏపీలోని 37 బ్రాంచ్‌ల నుంచి వచ్చిన డబ్బును ఇతర సంస్థల్లో పెట్టుబడిగా పెట్టినట్టు ఆమె అంగీకరించినట్టు సమాచారం. అయితే అలా మళ్లించిన నిధులను ఏయే కంపెనీలో పెట్టారన్న దానిపై మాత్రం ఆమె వివరాలు చెప్పలేదు. తనకు తెలియదంటూ దాటవేశారు. చందాదారుల సొమ్ము మాత్రం భద్రంగా ఉందంటూ సమాధానం ఇచ్చారు.

రాత్రి 10 గంటల వరకు విచారించినా కొన్ని అంశాలపై ఆమె సరైన సమాధానాలు, వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది. దాంతో మరోసారి ఆమెకు నోటీసులు ఇచ్చి విచారించాలని సీఐడీ నిర్ణయించింది. రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని సీఐడీ అధికారులు చెబుతున్నారు.

First Published:  7 Jun 2023 3:07 AM GMT
Next Story