Telugu Global
Telangana

మావోయిస్టు పార్టీ అగ్రనేత రాజిరెడ్డి మృతి? ధ్రువీకరించని పార్టీ, కుటుంబ సభ్యులు

మల్లా రాజిరెడ్డి మృతదేహం వద్ద పార్టీ శ్రేణులు విలపిస్తున్నట్లుగా కనిపిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. అయితే మావోయిస్టు పార్టీ గానీ, మల్లా రాజిరెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఈ మరణాన్ని ఇంత వరకు ధ్రువీకరించలేదు.

మావోయిస్టు పార్టీ అగ్రనేత రాజిరెడ్డి మృతి? ధ్రువీకరించని పార్టీ, కుటుంబ సభ్యులు
X

నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అనారోగ్యంతో మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం ఒక వీడియో వైరల్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జబ్బగుట్ట ఉసూరు బ్లాక్‌లోని దండకారణ్యంలో రాజిరెడ్డి విష జ్వరం బారిన పడినట్లు తెలుస్తున్నది. ఆయనకు అడవిలోనే ప్రాథమిక చికిత్స చేసినా కోలుకోలేదని.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సమీపంలోని పట్టణానికి తరలించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించి మూడు రోజుల క్రితం అటవీ ప్రాంతంలోనే ఆయన మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది.

మల్లా రాజిరెడ్డి మృతదేహం వద్ద పార్టీ శ్రేణులు విలపిస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. అయితే మావోయిస్టు పార్టీ గానీ, మల్లా రాజిరెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఈ మరణాన్ని ఇంత వరకు ధ్రువీకరించలేదు. గతంలో కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, హరిభూషణ్, ఆర్కే, కటకం సుదర్శన్ అనారోగ్య కారణాలతో చనిపోయినప్పుడు పార్టీయే బహిరంగ ప్రకటన చేసింది. కానీ రాజిరెడ్డి మృతిపై మాత్రం ఇంత వరకు అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.

మావోయిస్టు పార్టీ (అప్పటి పీపుల్స్ వార్) తొలి తరం నాయకులు అయిన కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తి, మల్లోజుల కోటేశ్వరరావు తదితరుల సమకాలికుడే మల్లా రెడ్డిరెడ్డి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్ పంచాయతీ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాధమ్మ, వెంకటరెడ్డి దంపతులకు రాజిరెడ్డి తొలి సంతానం. మంథనిలోనే ఇంటర్ వరకు చదువుకున్న రాజిరెడ్డి.. ఆ తర్వాత రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్‌యూ)లో చేరారు. అప్పుడే ఆయనకు రత్నమ్మతో వివాహం జరిగింది. వీరికి శ్రీలత అలియాస్ స్నేహలత అనే కుమార్తె ఉన్నది.

కూతురు పుట్టిన కొన్నాళ్లకే రాజిరెడ్డి 1977లో పీపుల్స్ వార్‌లో చేరారు. ఐదేళ్ల తర్వాత భార్య రత్నమ్మ కూడా ఉద్యమంలో చేరడానికి అడవిబాట పట్టారు. 1996-97లో రాజిరెడ్డిని పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో ఆయన పార్టీ కోసం పని చేశారు. గెరిల్లా యుద్ద విద్యలో రాజిరెడ్డికి మంచి అనుభవం ఉన్నట్లు చెబుతుంటారు. 1986లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌పై దాడి.. ఖమ్మం జిల్లా కరకగూడెం స్టేషన్‌పై దాడి, ఆదిలాబాద్ జిల్లా తపాల్‌పూర్‌లో నలుగురి హత్య వంటి కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు.

తపాల్‌పూర్ ఘటన పీపుల్స్ వార్ చేసిన తొలి హత్యలుగా పేర్కొంటారు. ఈ కేసులో కొండపల్లి సీతారామయ్య ఏ1గా ఉండగా.. రాజిరెడ్డిని పోలీసులు ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసులో కూడా రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. రాజిరెడ్డిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.1 కోటి రివార్డు, తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.

ఒక సారి పోలీసులకు చిక్కి..

రాజిరెడ్డి 2007లో కేరళలోని ఎర్నాకుళం జిల్లా అంగన్‌మలైలో పోలీసులకు చిక్కారు. ఆయనను అప్పుడు కరీంనగర్ జిల్లాకు తీసుకొని వచ్చి.. 2007 డిసెంబర్ 18న మెట్‌పల్లి కోర్టులో, డిసెంబర్ 22న మంథని కోర్టులో హాజరు పరిచారు. 14 రోజుల కస్టడీ తర్వాత రాజిరెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, అప్పుడే ఆయన 30 ఏళ్ల తర్వాత కన్నతల్లిని చూశారు. అడవిని వదలి ఇప్పటికైనా రావాలని తల్లి కోరినా.. 2009 అక్టోబర్ 9న బెయిల్‌పై విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

రాజిరెడ్డి భార్య రత్నమ్మ దాదాపు 15 ఏళ్ల పాటు పని చేసిన తర్వాత ఒక ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఇక రాజిరెడ్డి కూతురు స్నేహలత.. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్‌లో పని చేశారు. అప్పుడే ఆమె ఓయూ ప్రొఫెసర్ చింతకింది కాశీంను పెళ్లి చేసుకున్నారు. రాజిరెడ్డికి పార్టీలో సంగ్రామ్‌ అనే పేరుతో పాటు సత్తన్న, మీసాల సాయన్న, సాగర్, అలోక్, దేశ్‌పాండే, ఎస్ఎన్, లక్ష్మణ్ వంటి మారు పేర్లు ఉన్నాయి. కాగా, రాజిరెడ్డి మృతి చెందినట్లు తమకు ఇంకా తెలియదని తమ్ముడు భీమారెడ్డి తెలిపారు. ఒక వేళ అన్న చనిపోయింది నిజమే అయితే.. ఆయన మృత దేహాన్ని కుటుంబానికి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

First Published:  19 Aug 2023 1:05 AM GMT
Next Story