Telugu Global
Telangana

పోలింగ్ ని బహిష్కరించిన గ్రామాలు.. ఓటర్లు లేని పోలింగ్ బూత్ లు

ఇప్పటి వరకు అక్కడ ఒక్క ఓటు కూడా పోల్‌ కాలేదు. దీంతో అధికారులకు ఏం చేయాలో తోచడంలేదు. వీలైనంత వరకు ఓటర్లను చైతన్యవంతం చేసి పోలింగ్ కేంద్రాలకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

పోలింగ్ ని బహిష్కరించిన గ్రామాలు.. ఓటర్లు లేని పోలింగ్ బూత్ లు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని గ్రామాలు ఏకంగా పోలింగ్ నే బహిష్కరించాయి. ఆయా గ్రామాల్లో పోలింగ్ బూత్ లు ఖాళీగా కనిపించాయి. కొన్ని చోట్ల ఒకరిద్దరు ఓటు వేసి రాగా.. మిగతా వారంతా ఓటింగ్ కి స్వచ్ఛందంగా దూరంగా ఉన్నారు. తమ సమస్యలు పరిష్కారం కాలేదని, తాము ఎవరికీ ఓట్లు వేయబోమని తేల్చి చెబుతున్నారు ఆయా గ్రామాల ప్రజలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో ఓటు వేయకుండా పోలింగ్ ను బహిష్కరించారు గిరిజనులు. తమ గ్రామంలో అభివృద్ధి జరగలేదని, అందుకే తాము పోలింగ్ బూత్ లకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు.

వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు మండలంలోని రెండు గ్రామాల్లో ఇప్పటి వరకు ఒక్క ఓటు కూడా పడలేదు. మండలంలోని కొత్త మేడేపల్లి గ్రామంలో మౌలిక వసతులు కల్పించలేదంటూ గిరిజనులు నిరసన తెలిపారు. అధికారులు నచ్చజెబుతున్నా వారు మాత్రం పోలింగ్ కి దూరంగానే ఉన్నారు. అదే మండలంలోని రాజులపాలెం గ్రామంలోనూ పోలింగ్ కి వచ్చేది లేదని ఓటర్లు భీష్మించుకు కూర్చున్నారు. తమ గ్రామంలో రోడ్డు వేయలేదని, అందుకే తాము ఓటింగ్ కి దూరంగా ఉన్నామని చెప్పారు రాజులపాలెం గ్రామస్తులు.

బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామస్తులది మరో సమస్య. తమ గ్రామాన్ని పంచాయతీగా మార్చలేదని వారు పోలింగ్‌ కు దూరంగా ఉన్నారు. ఉదయం 11గంటల వరకు ఆ గ్రామంలో కేవలం 20 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ఓట్లకు డబ్బులివ్వలేదని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాలేదు. ఇప్పటి వరకు అక్కడ ఒక్క ఓటు కూడా పోల్‌ కాలేదు. దీంతో అధికారులకు ఏం చేయాలో తోచడంలేదు. వీలైనంత వరకు ఓటర్లను చైతన్యవంతం చేసి పోలింగ్ కేంద్రాలకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.


First Published:  30 Nov 2023 6:48 AM GMT
Next Story