Telugu Global
Telangana

మెడికల్ కాలేజీలు రావడం వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది : మంత్రి హరీశ్ రావు

ఉద్యమ కాలం నుంచే ఫాదర్ కొలంబో ఆసుపత్రి, కాలేజీ గురించి వింటున్నాను. ఈ రోజు ఫాదర్ కొలంబో కల నెరవేరిందని హరీశ్ రావు అన్నారు.

మెడికల్ కాలేజీలు రావడం వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది : మంత్రి హరీశ్ రావు
X

మెడికల్ కాలేజీ ఏర్పాటైతే అక్కడకు 500 పడకల ఆసుపత్రి వస్తుంది. ఇది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మెడికల్ కాలేజీ వల్ల వైద్య సదుపాయాలు మెరుగు పడటమే కాకుండా.. అనేక మందికి ఉపాధి కూడా దొరుకుతుందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెడికల్ కాలేజీ వల్ల ఆ ప్రాంతంలో అభివృద్ధి కూడా జరుగుతుందని తెలిపారు. హన్మకొండలో నిర్మించిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీని మంత్రి దయాకర్‌ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..

ఉద్యమ కాలం నుంచే ఫాదర్ కొలంబో ఆసుపత్రి, కాలేజీ గురించి వింటున్నాను. ఈ రోజు ఫాదర్ కొలంబో కల నెరవేరిందని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలు ఇస్తుందని తెలిపారు. వరంగల్ ఇప్పుడు మూడు మెడికల్ కాలేజీలకు కేంద్రంగా మారిందని చెప్పారు. కాకతీయ మెడికల్ కాలేజీకి ఎంతో చరిత్ర ఉన్నదని.. కాళోజీ మెడికల్ యూనివర్సిటీ కూడా వరంగల్‌ నుంచే సేవలు అందిస్తోందని మంత్రి గుర్తు చేశారు. వరంగల్‌లో రూ.1,100 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న హెల్త్ సిటీ వల్ల ఉత్తర తెలంగాణలో వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని మంత్రి చెప్పారు.

ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేశారని చెప్పారు. ఒకప్పుడు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 20 మెడికల్ కాలేజీలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 55కు చేరుకుందని అన్నారు. ఎంబీబీఎస్ సీట్లు 2,950 నుంచి 8,340 పెరిగినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఇదంతా సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇప్పటికే భూపాలపల్లి, జనగాంలో మెడికల్ కాలేజీలు వచ్చాయని.. త్వరలోనే ములుగులో కూడా మెడికల్ కాలేజీ రానున్నట్లు మంత్రి వెల్లడించారు.

హన్మకొండలోని పాత మిషన్ ఆసుపత్రిని మించి కొలంబో ఆసుపత్రి పని చేయాలని పంచాయతిరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు సూచించారు. వరంగల్‌లో ఫాదర్ కొలంబో ఆసుపత్రిని మంత్రి హరీశ్ రావుతో కలిసి ప్రారంభించడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేష్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.


First Published:  31 May 2023 3:21 PM GMT
Next Story