Telugu Global
Telangana

కరీంనగర్‌లో నిర్మించే మానేరు రివర్ ఫ్రంట్.. ప్రపంచంలోనే అధునాతనమైనది : మంత్రి గంగుల కమలాకర్

మానేరు రివర్ ఫ్రంట్ కోసం రూ.410 కోట్ల వ్యయం అవుతోందని.. ఇప్పటికే ఎంఆర్ఎఫ్‌లో భాగంగా ఒక పెద్ద ఫౌంటైన్ కూడా ప్రారంభం అయ్యిందని మంత్రి వెల్లడించారు.

కరీంనగర్‌లో నిర్మించే మానేరు రివర్ ఫ్రంట్.. ప్రపంచంలోనే అధునాతనమైనది : మంత్రి గంగుల కమలాకర్
X

కరీంనగర్‌లో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ ప్రపంచంలోనే అత్యాధునికమైనదని.. ఆ ప్రాంతాన్ని ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గుజరాత్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ కంటే.. మానేరు రివర్ ఫ్రంట్ అత్యంత అద్భుతంగా ఉండబోతోందని ఆయన స్పష్టం చేశారు. మానేరు నది వద్ద రెండు దశల్లో ఈ రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నామని.. మొదటి దశలో 3.5 కిలోమీటర్లు, రెండో దశలో 6.25 కిలోమీటర్ల మేర ఈ రివర్ ఫ్రంట్ ఉండనున్నదని చెప్పారు.

మానేరు రివర్ ఫ్రంట్ కోసం రూ.410 కోట్ల వ్యయం అవుతోందని.. ఇప్పటికే ఎంఆర్ఎఫ్‌లో భాగంగా ఒక పెద్ద ఫౌంటైన్ కూడా ప్రారంభం అయ్యిందని మంత్రి వెల్లడించారు. ఇటీవల ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జ్ వల్ల మానేరు రివర్ ఫ్రంట్‌కు సరికొత్త శోభ వచ్చిందని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వరదలను తట్టుకునే విధంగా ఆఫ్ చెక్ డ్యాం, ఆఫ్ బ్యారేజ్ నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. ఆగస్టులోగా మానేరు మొదటి దశ పనులను పూర్తిచేసి 12 అడుగుల లోతు ఉండేలా నీళ్లను నిలపాలని నిర్ణయించినట్లు మంత్రి గంగుల చెప్పారు.

మానేరు రివర్ ఫ్రంట్ కోసం రూ.310 కోట్లు, పర్యాటకానికి మరో రూ.100 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. స్పీడ్ బోట్ల కోసం రూ.10 కోట్లు, ఎల్లమ్మ దేవాలయం వద్ద ఎంట్రన్స్ ప్లాజా నిర్మాణానికి మరో రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్నామని అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ మరింత సుందరంగా తీర్చి దిద్దడానికి మరో రూ.250 కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు.

ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జి వల్ల మానేరు నది కళకళలాడుతోందని.. రివర్ ఫ్రంట్ కూడా పూర్తయితే.. కరీంనగర్ పర్యాటకానికి మరింత ఉత్తేజం వస్తుందని చెప్పారు. పర్యాటకులను ఆకట్టుకునేలా మరిన్ని వసతులను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఒక బృందాన్ని విదేశాలకు పంపించి అధ్యయనం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

విదేశాలు వెళ్లే ప్రతినిధుల బృందంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఇతర అధికారులు ఉంటారని గంగుల కమలాకర్ తెలిపారు.

First Published:  29 Jun 2023 2:34 PM GMT
Next Story