Telugu Global
Telangana

ఇప్పుడైతే కోటి కట్నం, అందమైన భార్య వచ్చేది.. మంచిర్యాల కమిషనర్‌ భార్య ఆత్మహత్య..

మంగళవారం ఉదయం పిల్లలను స్కూల్‌కు పంపిన జ్యోతి అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తన భర్త వేధింపులు ఎక్కువయ్యాయని.. చంపేసేలా ఉన్నాడంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పుడైతే కోటి కట్నం, అందమైన భార్య వచ్చేది.. మంచిర్యాల కమిషనర్‌ భార్య ఆత్మహత్య..
X

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌ బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదు.. హత్యేనంటున్నారు. కొంతకాలంగా బాలకృష్ణ తన భార్యను వేధిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్‌గా ఉద్యోగం సాధించిన తర్వాత బాలకృష్ణ వ్య‌వ‌హార శైలి మారినట్టు చెబుతున్నారు.

ఖమ్మం జిల్లా కేశవపురానికి చెందిన బాలకృష్ణ గతంలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేసేవాడు. 2014లో కొణిజర్ల మండలానికి చెందిన జ్యోతితో వివాహం జరిగింది. ఆ సమయంలో మూడు ఎకరాల పొలం, కొద్ది మేర బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొలి రోజుల్లో అంతా సజావుగానే సాగింది. 2020లో గ్రూప్ -2 పరీక్షలు రాసిన బాలకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికయ్యాడు.

ఏడాదిన్నర క్రితమే నిర్మల్ నుంచి మంచిర్యాలకు వచ్చాడు. కమిషనర్‌ అయినప్పటి నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. తాను తొందరపడి పెళ్లి చేసుకున్నా.. మున్సిపల్ కమిషనర్‌గా ఇప్పుడు తాను పెళ్లి చేసుకుని ఉంటే కోటి రూపాయలు వరకట్నంతో పాటు అందమైన భార్య దక్కి ఉండేదని జ్యోతిని వేధించినట్టు చెబుతున్నారు. మంగళవారం ఉదయం పిల్లలను స్కూల్‌కు పంపిన జ్యోతి అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తన భర్త వేధింపులు ఎక్కువయ్యాయని.. చంపేసేలా ఉన్నాడంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

విధులకు వెళ్లిన బాలకృష్ణ మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జ్యోతి తండ్రి రాంబాబు మాత్రం ఇది ముమ్మాటికి హత్యేనంటున్నారు. ఉదయం కూడా తమకు ఫోన్ చేసి చంపేసేలా ఉన్నాడంటూ తన కుమార్తె చెప్పిందని, బాలకృష్ణ పైకి మంచివాడిలా నటిస్తుంటాడని.. ఇంట్లో మాత్రం సైకోలా వ్యవహరిస్తుంటాడ‌ని ఆరోపించారు.

జ్యోతి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి ఫోన్‌ను సీజ్‌ చేశారు. మున్సిపల్ కమిషనర్‌ బాలకృష్ణ వ్యవహారశైలి ఎలా ఉండేదన్న దానిపై ఇంటి పనిమనిషితో పాటు చుట్టుపక్కల వారిని పోలీసులు ఆరా తీశారు. తమ అమ్మ చనిపోయిందని తెలుసుకున్న ఎనిమిదేళ్ల రిత్విక్‌, ఆరేళ్ల భవిష్య తల్లడిల్లిపోయారు.

First Published:  8 Feb 2023 4:09 AM GMT
Next Story