Telugu Global
Telangana

యువతిని హతమార్చిన ప్రేమోన్మాది.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

కొంతకాలంగా దీపనతో రాకేశ్‌కి పరిచయం ఉంది. పెళ్లి చేసుకోవాలని ఏడాది నుంచి అతను వెంటపడి వేధిస్తున్నాడు. అతని ప్రేమను ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు.

యువతిని హతమార్చిన ప్రేమోన్మాది.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
X

ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆమె ఇంట్లోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె స్నేహితులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపైనా దాడికి పాల్పడగా.. వారు గాయాలపాలయ్యారు. ఆ తర్వాత ఆత్మహత్యకు యత్నించిన యువకుడు విద్యుత్‌ షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం..

మృతురాలు దీపన తమాంగ్‌ పశ్చిమబెంగాల్‌కు చెందిన యువతి. ఆమె నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పనిచేస్తూ గోపనపల్లి తండా సమీపంలో తన స్నేహితులతో కలసి నివాసం ఉంటోంది. నిందితుడు రాకేశ్‌ స్వస్థలం కర్ణాటకలోని బీదర్‌. అతను మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. కొంతకాలంగా దీపనతో రాకేశ్‌కి పరిచయం ఉంది. పెళ్లి చేసుకోవాలని ఏడాది నుంచి అతను వెంటపడి వేధిస్తున్నాడు. అతని ప్రేమను ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు.

బుధవారం రాత్రి అదే కోపంతో దీపన ఇంటికి వెళ్లిన రాకేశ్‌.. అక్కడ ఉన్న కూరగాయల కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో దీపన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె స్నేహితులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపైనా దాడి చేశాడు. దీంతో వారు గాయాలపాలయ్యారు. ఈ ఘటన అనంతరం నిందితుడు మొయినాబాద్‌ సమీపంలోని కనకమామిడి వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. విద్యుత్‌ స్తంభం ఎక్కేందుకు ప్రయత్నించగా.. షాక్‌కు గురై గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు రాకేశ్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  29 Aug 2024 4:58 AM GMT
Next Story