Telugu Global
Telangana

న‌డిరోడ్డుపై క‌త్తుల‌తో.. హైద‌రాబాద్‌లో దారుణ హ‌త్య‌

సాయం కోసం కేక‌లు వేశాడు. అయినా నిందితులు అత‌న్ని వ‌ద‌ల‌కుండా వెంటాడి క‌త్తితో న‌రికి, రాడ్డుతో కొట్టి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. త‌ల, చేతులు, కాళ్లు, పొట్ట భాగంలో క‌త్తితో విచ‌క్ష‌ణారహితంగా దాడిచేశారు.

న‌డిరోడ్డుపై క‌త్తుల‌తో.. హైద‌రాబాద్‌లో దారుణ హ‌త్య‌
X

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. ముగ్గురు వ్య‌క్తులు ఒక వ్య‌క్తిని వెంటాడి.. న‌రికి చంపారు. ఈ హ‌త్య‌కు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అస‌లేం జ‌రిగిందంటే.. హ‌త్య‌కు గురైన జంగం సాయినాథ్ (29) అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట వాసి. అత‌ను ఒక‌ కార్పెంట‌ర్‌.

ఆదివారం సాయంత్రం పురానాపూల్ వైపు నుంచి మేక‌ల మండీ మార్గంలో బైక్‌పై ఒంట‌రిగా వెళుతున్న సాయినాథ్‌ని పాతబ‌స్తీలోని జియాగూడ వ‌ద్ద పీలిమండ‌వ్ శివాల‌యం స‌మీపంలో ముగ్గురు వ్య‌క్తులు అడ్డుకున్నారు. వెనుక నుంచి ఒక‌రు త‌ల‌పై ఇనుప రాడ్డుతో బ‌లంగా కొట్ట‌డంతో సాయినాథ్ కింద‌ప‌డిపోయాడు. ఆ వెంట‌నే నిందితులు ముగ్గురూ కొడ‌వ‌లి, క‌త్తి, రాడ్డుతో దాడికి దిగగా, వారినుంచి త‌ప్పించుకునేందుకు సాయినాథ్ ప‌రుగులు పెట్టాడు. సాయం కోసం కేక‌లు వేశాడు. అయినా నిందితులు అత‌న్ని వ‌ద‌ల‌కుండా వెంటాడి క‌త్తితో న‌రికి, రాడ్డుతో కొట్టి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. త‌ల, చేతులు, కాళ్లు, పొట్ట భాగంలో క‌త్తితో విచ‌క్ష‌ణారహితంగా దాడిచేశారు.

కానిస్టేబుల్ రావ‌డంతో..

సాయినాథ్‌పై దాడి జ‌రుగుతున్న స‌మ‌యంలో పురానాపూల్ వైపు నుంచి బైక్‌పై వ‌స్తున్న గోషామ‌హ‌ల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జ‌నార్ద‌న్‌.. ఈ దారుణాన్ని గ‌మ‌నించాడు. వెంట‌నే అరుచుకుంటూ ఘ‌ట‌నాస్థ‌లానికి వ‌స్తుండ‌గా, అత‌న్ని గ‌మ‌నించిన నిందితులు మూసీ న‌దిలోకి వెళ్లే మెట్ల మార్గం నుంచి దూకేసి ప‌రార‌య్యారు. తీవ్రంగా గాయ‌ప‌డి ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న సాయినాథ్ ని కాపాడేందుకు కానిస్టేబుల్ ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. అప్ప‌టికే సాయినాథ్ మృతిచెందాడు. ఆర్థిక లావాదేవీలు, వివాహేత‌ర సంబంధం కోణాల్లో పోలీసులు ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సాయినాథ్ ఫోన్ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు కొంత‌మందిని విచారించిన‌ట్టు తెలిసింది. ఆదివారం రాత్రి ఆ ముగ్గురు నిందితులూ వేరొక పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయిన‌ట్టు స‌మాచారం. దీనిని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. హ‌త్య జ‌రుగుతుండ‌గా చూసిన వారు సెల్‌ఫోన్‌లో ఈ దృశ్యాల‌ను బంధించ‌డంతో అవే ఇప్పుడు పోలీసుల‌కు ద‌ర్యాప్తులో కీల‌కంగా మారాయి.

First Published:  23 Jan 2023 5:29 AM GMT
Next Story