Telugu Global
Telangana

ఖర్గే కీలక వ్యాఖ్యలు.. రేవంత్ వర్గంలో ఆందోళన..!!

అధిష్టాన నిర్ణయం ఆలస్యమవుతున్న కొద్దీ రేవంత్ వర్గంలో ఆందోళన పెరుగుతోంది. దీనికితోడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో మరింత కలకలం రేగుతోంది.

ఖర్గే కీలక వ్యాఖ్యలు.. రేవంత్ వర్గంలో ఆందోళన..!!
X

తెలంగాణ సీఎం ఎంపిక విష‌యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరనేది ఈ రోజు తేలిపోతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇండియా కూటమి సమావేశానికి వెళ్లేముందు ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవ‌ర‌నేది ఈ రోజు నిర్ణయిస్తామన్నారు. అంటే సస్పెన్స్ ఈ రోజుతో వీడిపోతుందని తేలిపోయింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రేవంత్ వర్గం సంబరాలు చేసుకుంది. రేవంత్ రెడ్డే సీఎం అంటూ అందరూ సందడి చేశారు. సస్పెండ్ కాకముందు తెలంగాణ డీజీపీ కూడా నేరుగా రేవంత్ రెడ్డిని కలవడం, శుభాకాంక్షలు చెప్పడం, రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచడం.. ఇలాంటి వన్నీ ఆయన వర్గంలో మరింత సంతోషాన్ని కలిగించాయి. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ ఏకవాక్య తీర్మానం ఊహించినదే అయినా.. ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం ఆలస్యమవుతున్న కొద్దీ రేవంత్ వర్గంలో ఆందోళన పెరుగుతోంది. దీనికితోడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో మరింత కలకలం రేగుతోంది.

సీఎం ఎవరు..?

తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణం ఎవరు అంటే అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డి పేరు చెబుతున్నారు. అదే సమయంలో సీఎం కుర్చీ ఎవరిది అంటే మాత్రం ఆ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తం కావడంలేదు. ఎవరికి వారే తాము సీఎం రేసులో ఉన్నామని చెప్పుకుంటున్నారు. వీళ్లందర్నీ బుజ్జగించి ఒకరిని సీఎంగా ప్రకటించడం అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది. అందుకే వారు టైమ్ తీసుకుంటున్నారు. ఈలోగా తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రిజల్ట్ విషయంలో కూడా ఇంత ఆందోళన పడలేదని, ఇప్పుడు సీఎం పేరు ప్రకటన విషయంలో టెన్ష‌న్‌ ఎక్కువవుతోందని అంటున్నారు.

First Published:  5 Dec 2023 6:27 AM GMT
Next Story