Telugu Global
Telangana

ప్రతీ బూత్‌లో మెజార్టీ రావాలి : మంత్రి కేటీఆర్

తెలంగాణలోని 119 నియోజకవర్గాలకుగాను ప్రతీ సెగ్మెంట్‌లో వార్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

ప్రతీ బూత్‌లో మెజార్టీ రావాలి : మంత్రి కేటీఆర్
X

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి.. క్షేత్ర స్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే పార్టీపరంగా అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ప్రచారంలో దూకుడుగా ఉండటంతో.. వారి వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలనే వ్యూహాలను పార్టీ శ్రేణులకు కేటీఆర్ వివరిస్తున్నారు.

తెలంగాణలోని 119 నియోజకవర్గాలకుగాను ప్రతీ సెగ్మెంట్‌లో వార్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న వార్‌ రూమ్‌లను కేటీఆర్, హరీశ్ రావు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గాలవారీగా నివేదికలు తెప్పించుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. బూత్ స్థాయి నుంచే మెజార్టీ రావాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ ఓటు కీలకమేనని.. ఎవరినీ నిర్లక్ష్యం చేయకుండా కలుపుకొని పోవాలని కార్యకర్తలకు సూచించారు.

ప్రతీ నియోజకవర్గానికి కేటాయించిన ఒక్కో వార్‌ రూమ్‌లో 350 మంది వరకు నియమించారు. ఆదివారం మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వార్‌ రూమ్‌ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఎలా వ్యవహరించాలో వార్‌ రూమ్ ప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

బూత్ స్థాయి నుంచే ప్రత్యర్థి పార్టీల కంటే ఎక్కువ ఓట్లు ఎలా సాధించాలో కేటీఆర్ అందరికీ సూచించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 3.17 కోట్ల ఓటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించారు. కార్యకర్తలను, కచ్చితంగా బీఆర్ఎస్‌కే ఓటేస్తారని భావించేవారిని 'ఏ' కేటగిరిలోకి, న్యూట్రల్ ఓటర్లను బి కేటగిరిలోకి విభజించారు. ఇక పార్టీపై వ్యతిరేకతతో ఉన్నవారిని సి కేటగిరీలోకి.. ఇతర పార్టీలోని కార్యకర్తలు, అభిమానులను డి కేటగిరీలోకి విభజించారు. ప్రతీ కేటగిరీలోని ఓటర్లను ఎలా కారు గుర్తుకు ఓటేయించాలనే విషయంపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

దీంతో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకొని వెళ్లడం, ప్రచార కార్యక్రమాలను మరింత ఉధృతం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టనున్నది.


First Published:  22 Oct 2023 5:48 AM GMT
Next Story