Telugu Global
Telangana

మహారాష్ట్ర ఆడబిడ్డలకు తెలంగాణ ఆస్పత్రుల్లో పునర్జన్మ..

ఆ 4 జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో 20శాతం మహారాష్ట్ర వారివేనంటూ ఇటీవల ఓ ఆసక్తికర సర్వే బయటకొచ్చింది. ముఖ్యంగా బాలింతలకు ఇస్తున్న కేసీఆర్ కిట్, వారికి ఎంతగానే ఉపయోగపడుతోంది.

మహారాష్ట్ర ఆడబిడ్డలకు తెలంగాణ ఆస్పత్రుల్లో పునర్జన్మ..
X

ఏపీలో ఏ రాజకీయ నాయకుడికైనా, అధికారికైనా అనారోగ్యం వస్తే ఏం చేస్తారు. వెంటనే హైదరాబాద్ ప్రయాణం కడతారు. మంచి కార్పొరేట్ ఆస్పత్రిలో చూపించుకుంటారు. ఇటీవల ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. కేవలం ఏపీ నుంచే కాదు, ఇతర రాష్ట్రాలనుంచి కూడా మెరుగైన వైద్యం కోసం తెలంగాణకు వస్తుంటారు చాలామంది. ఇక తెలంగాణలో ప్రభుత్వ వైద్యం కూడా ఇటీవల బాగా మెరుగైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో వసతులు అందుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాల సంఖ్యే వాటి పనితీరుకి గీటురాయిగా మారింది. అయితే ఇక్కడ ఇంకో విశేషముంది. కేవలం తెలంగాణ మహిళలకే కాదు, పొరుగు రాష్ట్రాల మహిళలు కూడా పురుడు కోసం తెలంగాణ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. మహారాష్ట్రనుంచి వేలాదిమంది ప్రసవం కోసం తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. ఇటీవల ఈ సంఖ్య భారీగా పెరిగింది. ప్రసవం అంటే మహిళకు పునర్జన్మ లాంటిది. పక్క రాష్ట్రం మహిళలకు కూడా అలాంటి పునర్జన్మని ప్రసాదిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులు.

Advertisement

తెలంగాణతో సరిహద్దుని పంచుకుంటున్న మహారాష్ట్రలో మహిళలు ముఖ్యంగా ప్రసవం కోసం పొరుగు రాష్ట్రంవైపు చూస్తున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమ‌రం భీమ్ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. తెలంగాణ ఆస్పత్రుల్లో ప్రసవాలు సురక్షితం అనే పేరు రావడంతో అందరూ ఇక్కడికే వస్తున్నారు. ఆ 4 జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో 20శాతం మహారాష్ట్ర వారివేనంటూ ఇటీవల ఓ ఆసక్తికర సర్వే బయటకొచ్చింది. ముఖ్యంగా బాలింతలకు ఇస్తున్న కేసీఆర్ కిట్, వారికి ఎంతగానే ఉపయోగపడుతోంది. మహారాష్ట్రలో మెరుగైన సౌకర్యాలు లేకపోవడం, పొరుగున ఉన్న తెలంగాణలో మంచి వైద్యం అందుబాటులో ఉండటంతో గర్భిణుల కుటుంబ సభ్యులు మరో ఆలోచన లేకుండా ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రులకే తీసుకొస్తున్నారు.

Advertisement

ప్రసవంలో రిస్క్ ఎక్కువగా ఉందని తేలితే వెంటనే మహిళలు తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారట. మహారాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలు లేకపోవడంతో వారు ఇటువైపు వస్తున్నారని చెబుతున్నారు తెలంగాణ వైద్య అధికారులు. పొరుగు రాష్ట్రంలో పుట్టినప్పటికీ తమ ప్రసవ వేదన తీరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆ మహిళలు కృతజ్ఞతతో చెబుతున్నారు. తమ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ వైద్యం చేయడమే ఎక్కువ అని, అలాంటిది అక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు కష్టం అని, తెలంగాణలో మాత్రం తమని కంటికి రెప్పలా చూసుకుంటున్నారని చెబుతున్నారు మహిళలు. ప్రసవంతోపాటు బిడ్డలకోసం ఇస్తున్న కేసీఆర్ కిట్ కూడా తమకెంతో ఉపయోగకరంగా ఉందని అంటున్నారు. ఒకటిన్నర ఇంజిన్ సర్కారు ఉన్న మహారాష్ట్ర కంటే సింగిల్ ఇంజిన్ సర్కారు తెలంగాణే గొప్ప అని ఈ విషయంలోనూ రుజువైంది.

Next Story