Telugu Global
Telangana

'మహా' మహిళలు.. బీఆర్ఎస్ లోకి వలసలు

మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మహిళా నేతలు ప్రశంసించారు. సీఎం కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

మహా మహిళలు.. బీఆర్ఎస్ లోకి వలసలు
X

బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మహారాష్ట్ర నుంచి భారీగా వలసలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో వరుస సభలు నిర్వహించడం, తెలంగాణ అభివృద్ధి మోడల్ తో మహారాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకోవడంతో నాయకులు గులాబి కండువా కప్పుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా పెద్ద ఎత్తున మహిళా నేతలు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్ వారికి సాదర ఆహ్వానం పలికారు.

బీజేపీ, శివసేన, కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన పలువురు మహారాష్ట్ర మహిళా నేతలు బీఆర్ఎస్ లో చేరారు. కారంజా కార్పొరేటర్‌ మాలతాయి సరోదే, మంగళాతాయి అడ్వికర్‌, బీజేపీ మహిళా అఘాడి అధ్యక్షురాలు సరికాతాయి థాక్రే, శివసేన మహిళా అఘాడి చీఫ్‌ వనితా తాయిఢోక్‌, బీఎస్పీ నాయకురాలు శిలాతాయి మెహరే, బెలోరా గ్రామ పంచాయతీ కాంగ్రెస్‌ సర్పంచ్‌ చాండదతాయి జాకే.. తదితరులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరంతా స్థానికంగా మంచి పట్టున్న మహిళా నాయకులు కావడం విశేషం. గ్రామ, మండల స్థాయిలో కీలక పార్టీల్లో వివిధ పదవుల్లో ఉన్న మహిళలంతా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణకు తమవంతు కృషి చేస్తామని చెబుతున్నారు.

మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మహిళా నేతలు ప్రశంసించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో సీఎం కేసీఆర్‌ ఎక్కువభాగం మహిళలకే కేటాయిస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. పార్టీలో చేరిన మహిళా నేతలంతా ఈ నెల 19, 20 తేదీల్లో నాందేడ్‌ లో జరిగే శిక్షణా తరగతులకు హాజరు కావాలని సూచించారు సీఎం కేసీఆర్. మహారాష్ట్రలో బీఆర్ఎస్ మహిళా విభాగాన్ని విస్తరించాలని, మరింత మందికి తెలంగాణ అభివృద్ధి మోడల్ ని విశదపరచాలని చెప్పారు.

First Published:  17 May 2023 2:10 AM GMT
Next Story