Telugu Global
Telangana

మహారాష్ట్ర నుంచి భారీ చేరికలు.. బీఆర్ఎస్ లోకి సర్పంచ్ లు

కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే, మహారాష్ట్రకు ఏం తక్కువ అని ప్రశ్నించారు కేసీఆర్. ఈ విషయంపై మహారాష్ట్ర పల్లెల్లో చర్చ జరగాలన్నారు.

మహారాష్ట్ర నుంచి భారీ చేరికలు.. బీఆర్ఎస్ లోకి సర్పంచ్ లు
X

మహారాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. చేరికలతో మహారాష్ట్ర బీఆర్ఎస్ బలం పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో నేతల చేరికపై కేసీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వ్యూహాలు రచిస్తున్నారాయన. తాజాగా మహారాష్ట్రలోని దక్షిణ షోలాపూర్ కి చెందిన 55మంది సర్పంచ్ లు ఒకేసారి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ మహా వ్యూహానికి ఇదే తాజా ఉదాహరణ.

మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లు, తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో బీఆర్‌ఎస్‌ గెలిస్తే దేశాన్ని శాసించగలం అని సర్పంచ్ ల చేరికల కార్యక్రమంలో చెప్పారు సీఎం కేసీఆర్. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మార్చి మనం దేశానికి నేతృత్వం వహించే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారాయన. త్వరలో గూండ్నా జిల్లా మొత్తం బీఆర్ఎస్ సర్పంచ్ లు ఉంటారన్నారు. విదర్భ ప్రాంతంలో బీఆర్ఎస్ హవా కనపడుతోందన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ అధికారాన్ని చేపట్టాక తెలంగాణ మాడల్‌ అమలు చేస్తామన్నారు. రెండు నెలల్లోనే మార్పులు మొదలవుతాయని, రెండేళ్లల్లో వెలుగుల జిలుగుల మహారాష్ట్రను సాకారం చేస్తామని అన్నారు. మూడు, నాలుగేళ్లలో మహారాష్ట్రలోని పట్టణాలు, పల్లెలు, గూడేలు, తండాలు అని తేడా లేకుండా ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు అందిస్తామన్నారు కేసీఆర్.


దేశంలో రైతు ప్రభుత్వం వస్తేనే అన్నదాతల తలరాతలు మారుతాయన్నారు కేసీఆర్. దేశంలో పేద, ధనిక అంతరం పెరిగిపోతోందని, దానికి తగ్గట్టే ధర్మం పేరుతో, జాతి పేరుతో, పార్టీల పేరుతో మనల్ని విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దేశానికి మేలు జరగాలంటే రైతులు మేల్కొనాలని చెప్పారు. దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో జరుగుతున్నాయని, ఇది అత్యంత బాధాకరం అని చెప్పారు. బీఆర్‌ఎస్‌ గెలిస్తే రైతులు, పేదలు అభివృద్ధి చెందినట్టేనన్నారు. ఈ ఒక్కసారి బీఆర్‌ఎస్‌ ను గెలిపించండి. గులాబీ జెండాకు జై కొట్టండి.. ఎలాంటి మార్పు వస్తుందో చూడండి అని సర్పంచ్ లకు సూచించారు కేసీఆర్.

కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే, మహారాష్ట్రకు ఏం తక్కువ అని ప్రశ్నించారు కేసీఆర్. ఈ విషయంపై మహారాష్ట్ర పల్లెల్లో చర్చ జరగాలన్నారు. మహారాష్ట్రలో పేదలకు నెలకు కేవలం వెయ్యి రూపాయల సామాజిక పెన్షన్ ఇస్తున్నారని, అది కూడా మూడు నెలలకోసారి ఇస్తున్నారని, తెలంగాణణలో నెలకు రూ.2,016 ఇస్తున్నామని చెప్పారు. ఈ మార్పు మహారాష్ట్రలో కూడా రావాలన్నారు. బీఆర్‌ఎస్‌ పేరుకే పార్టీ. కానీ, భారత్‌ పరివర్తనే బీఆర్‌ఎస్‌ అసలు లక్ష్యం అన్నారు కేసీఆర్. భారతదేశం అంతా మార్పు చెందాలన్నదే బీఆర్‌ఎస్‌ మిషన్‌ అని చెప్పారు.

First Published:  8 Aug 2023 1:00 AM GMT
Next Story