Telugu Global
Telangana

తెలంగాణ మొదలు పెట్టింది... ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి

తెలంగాణలో గొల్ల, కురుమ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయాలనిమహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఆ రాష్ట్ర అధికారులు గొర్రెల పంపిణీ పథకాన్ని పరిశీలించేందుకు తెలంగాణ సందర్శించారు.

తెలంగాణ మొదలు పెట్టింది... ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి
X

తెలగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలు యావ‌త్ దేశాన్ని ఆక‌ర్షిస్తున్నాయి. తెలంగాణ పథకాలు తమకూ కావాలంటూ ఇతర రాష్ట్రాల్లో ప్రజలు డిమాండ్ చేస్తుండగా, ప్ర‌జ‌ల కోరిక మేర‌కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలకు తెలంగాణ‌లోని ప‌థ‌కాల‌ను వారి రాష్ట్రంలో అమ‌లు చేయ‌క త‌ప్ప‌డం లేదు. తమ రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేయడం కోసం ఆయా రాష్ట్రాల అధికారులు తెలంగాణను సందర్శించి ఇక్కడి పథకాలను పరిశీలిస్తున్నారు.

అదే విధంగా తెలంగాణలో గొల్ల, కురుమ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఆ రాష్ట్ర అధికారులు గొర్రెల పంపిణీ పథకాన్ని పరిశీలించేందుకు తెలంగాణను సందర్శించారు. మహారాష్ట్ర షీప్‌ అండ్‌ మేకల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శశాంక్‌ కాంబ్లే, పశుసంవర్ధక, డెయిరీ, మత్స్యశాఖ అండర్‌ సెక్రటరీ వికాస్‌ కదమ్, తదితరులతో కూడిన ప్ర‌తినిధుల‌ బృందం తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ అధికారులతో శుక్రవారం రోజున హైదరాబాద్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంపై మహారాష్ట్ర అధికారులకు వివరించారు.

ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో సుమారు రూ.12,000 కోట్లు ఖర్చు చేసింది. మొదటి దశలో 3,60,098 మంది లబ్ధిదారులకు, రెండో దశలో మరో 3,57,981 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు.

75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 8,710 గ్రామ పంచాయతీల్లోని 7,846 సొసైటీల్లో 7,18,069 మంది (18 ఏళ్లు నిండినవారు) సభ్యత్వాలు తీసుకున్నారు. గొర్రెల యూనిట్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో 100 సంచార పశువైద్యశాలలను నిర్వహిస్తోంది. ఈ వెటర్నరీ క్లినిక్‌ల ద్వారా గొర్రెల కాపరుల ఇంటివద్దకే మందులను సరఫరా చేయడంతోపాటు, నులిపురుగుల నిర్మూలన, టీకాల శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.

ఈ చర్యలతో పాటు, ప్రతి జిల్లాకు 4 టన్నుల స్టైలో గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్నారు. ఇంకా, ప్రతి గొర్రె యూనిట్ కూడా బీమా పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. టోల్ ఫ్రీ నంబర్ 1962తో ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడింది. గొర్రెల పంపిణీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, క్రమం తప్పకుండా పర్యవేక్షించడం సామాజిక, అభివృద్ధిలో సహాయపడింది.

ఈ సందర్భంగా శశాంక్ కాంబ్లే మాట్లాడుతూ.. తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర‌ ఫడ్నవీస్, పశుసంవర్ధక శాఖ మంత్రి రాధాకృష్ణ వీకే పాటిల్ పూర్తి సమాచారం కోరినట్లు తెలిపారు.

NCDC నుండి రుణాలు పొందిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తమ రాష్ట్రం, గుజరాత్‌, రాజస్థాన్‌ల నుంచి మాంసాన్ని దిగుమతి చేసుకుంటోందని, ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మాంసం ఉత్పత్తిని పెంచుతామని ఆయన తెలిపారు.

First Published:  3 Dec 2022 7:30 AM GMT
Next Story