Telugu Global
Telangana

బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర నేతలు.. కేసీఆర్ దిశా నిర్దేశం

మహారాష్ట్రలో వచ్చే జెడ్పీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలన్నారు. తాను చెప్పే మాటలను గ్రామాలకు వెళ్లి చర్చించండి అంటూ మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు దిశా నిర్దేశం చేశారు కేసీఆర్.

బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర నేతలు.. కేసీఆర్ దిశా నిర్దేశం
X

మహారాష్ట్ర చంద్రాపూర్‌ కు చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. డీఎన్డీ మహారాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌ రావు అంగళ్వార్‌, మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రవీందర్‌ సింగ్‌, కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు బల్బీర్‌ సింగ్‌, బంజారా ఉమెన్‌ అధ్యక్షురాలు రేష్మ చౌహాన్‌, గడ్చిరోలి మాజీ జడ్పీ ఛైర్మన్‌ సమ్మయ్య తదితరులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

మహారాష్ట్రలో ప్రతి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలుంటారని, అన్ని కమిటీలు వేసి మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. జిల్లా పరిషత్‌ ఎన్నికలతో మన పని మొదలవుతుందని నేతలకు చెప్పారు కేసీఆర్. ప్రతి గడపను తాకండి, ప్రతీ మనిషిని పలకరించండి అని వారికి దిశా నిర్దేశం చేశారు. నాగ్‌ పూర్‌, ఔరంగాబాద్‌ లో బీఆర్‌ఎస్‌ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని, మే 7 నుంచి జూన్‌ 7 వరకు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్‌ కమిటీ వేస్తామని, 10 నుంచి 12లక్షల మందితో మహారాష్ట్రలో భారీ కిసాన్‌ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు.


మీరేం చేయాలంటే..?

భారత్‌ పరివర్తన్‌ మిషన్‌ గా భారత్‌ రాష్ట్ర సమితి పని చేస్తుందన్నారు కేసీఆర్. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ కు ఏం పని అని ఫడ్నవీస్‌ అన్నారని, మహారాష్ట్రలో తెలంగాణ మోడల్‌ అమలు చేస్తే తాము అక్కడికి రాబోమని చెప్పామని, కానీ ఫడ్నవీస్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చినవారిలో ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్‌ కావాలని . రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మహారాష్ట్రని తీర్చిదిద్దుకుందామని చెప్పారు. తెలంగాణలో సాధ్యమైనవన్నీ మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావని ప్రశ్నించారు. మహారాష్ట్రలో వచ్చే జెడ్పీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలన్నారు. తాను చెప్పే మాటలను గ్రామాలకు వెళ్లి చర్చించండి అంటూ మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు దిశా నిర్దేశం చేశారు కేసీఆర్.

గడ్చిరోలి నుంచి గోదావరి ప్రవహిస్తుంది కానీ, అక్కడ తాగునీరు ఉండదని, దానికి కారణం ఎవరని ప్రశ్నించారు కేసీఆర్. దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరివ్వాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం అన్నారాయన. దేశంలో 83కోట్ల ఎకరాల భూమిలో 41కోట్ల ఎకరాల భూమి సాగుకి ఉపయోగపడుతుందని, అయినా దేశంలో బర్గర్లు, పిజ్జాలు తినాల్సిన దౌర్భాగ్యం ఏమొచ్చిందని అన్నారు. దేశంలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఉన్నా, పాలకులు పట్టించుకోలేదని.. దీన్ని బీఆర్ఎస్ మార్చేస్తుందని హామీ ఇచ్చారు కేసీఆర్.

First Published:  26 April 2023 4:42 PM GMT
Next Story