Telugu Global
Telangana

తెలంగాణ మోడల్ ఫాలో అవుతున్న మహారాష్ట్ర

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సభలకు విశేష స్పందన లభించిందని.. అందుకే తమ రాష్ట్ర ప్రభుత్వం హడావిడి పడుతోందని మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సమితి అధ్యక్షుడు మాణిక్‌ కదం తెలిపారు. తెలంగాణ మోడల్‌ కోసం రైతులు ఉద్యమిస్తున్నారనే విషయాన్ని మహారాష్ట్ర సర్కార్‌ గుర్తించడం బీఆర్‌ఎస్‌ సాధించిన తొలి విజయమని పేర్కొన్నారు.

తెలంగాణ మోడల్ ఫాలో అవుతున్న మహారాష్ట్ర
X

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది బీఆర్ఎస్ నినాదం. రైతు రాజ్యం రావాలని చెబుతున్న బీఆర్ఎస్ నేతలు ఆల్రడీ తెలంగాణలో దాన్ని అమలులో పెట్టారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతలకు అండగా నిలిచారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆయా పథకాలపై ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని రైతు సంఘాల నాయకులు తెలంగాణ మోడల్ తమకూ కావాలని అక్కడి స్థానిక ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో షిండే సర్కారులో కదలిక వచ్చింది. నమో షేత్కరీ మహా సమ్మాన్‌ నిధి.. పథకాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి 6వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది.

దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ కార్యక్రమం అమలవుతోంది. అయితే ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలు పీఎం కిసాన్ నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మరింత సాయం జోడిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రైతులకు ఉన్న సాగుభూమి ఆధారంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులు ధీమాగా వ్యవసాయం చేస్తున్నారు. పెట్టుబడి సాయంతోపాటు, నిల్వ ఉంచిన సరకుపై వడ్డీలేని రుణాలు కూడా రైతులకు భరోసా కల్పిస్తున్నాయి. ఇలాంటి పథకాలు మహారాష్ట్రలో కూడా కావాలంటూ గాంధేయవాది, సంఘ సేవకుడు వినాయక్‌ రావ్‌ పాటిల్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మహారాష్ట్రలో తెలంగాణ రైతు మోడల్ అమలు చేయాలనే డిమాండ్ తో ఐదు రోజులుగా ఆయన చేస్తున్న దీక్షకు విశేష స్పందన వచ్చింది. దీంతో సీఎం ఏక్‌ నాథ్‌ షిండే ఆయన్ను చర్చలకు ఆహ్వానించారు. తెలంగాణ మోడల్‌ పై అధ్యయనం చేసేందుకు షిండే ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో నమో షేత్కరీ మహాసమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రకటించడం విశేషం.

పీఎం కిసాన్‌ పోర్టల్‌ లో నమోదైన లబ్ధిదారులకు ఈ సాయం అందజేయనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే మహారాష్ట్ర రైతులు కోరుకున్నది నెలకు వెయ్యి రూపాయలు కాదని, తెలంగాణ మోడల్ సంపూర్ణంగా అమలు చేసే వరకు తాము పోరాటం చేస్తామంటున్నారు రైతు సంఘాల నేతలు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల నిర్వహించిన నాందేడ్‌, కంధార్‌-లోహా, ఔరంగాబాద్‌ సభలకు విశేష స్పందన లభించిందని.. అందుకే తమ రాష్ట్ర ప్రభుత్వం హడావిడి పడుతోందని మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సమితి అధ్యక్షుడు మాణిక్‌ కదం తెలిపారు. తెలంగాణ మోడల్‌ కోసం రైతులు ఉద్యమిస్తున్నారనే విషయాన్ని మహారాష్ట్ర సర్కార్‌ గుర్తించడం బీఆర్‌ఎస్‌ సాధించిన తొలి విజయమని పేర్కొన్నారు.

First Published:  31 May 2023 5:01 AM GMT
Next Story