Telugu Global
National

మధ్యప్రదేశ్ కి ఐపీఎల్ జట్టు.. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పాటుపడతాం, స్టేడియంలు నిర్మిస్తాం, క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తాం అని చెప్పడానికి బదులు.. పక్కా కమర్షియల్ అయిన ఐపీఎల్ టీమ్ ని తీసుకొస్తామని చెప్పడం విశేషం.

మధ్యప్రదేశ్ కి ఐపీఎల్ జట్టు.. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ
X

ఎన్నికల మేనిఫెస్టోలో సహజంగా పథకాల ప్రస్తావన ఉంటుంది. పేదలకు అది చేస్తాం, ఇది చేస్తామని చెబుతుంటాయి పార్టీలు. ఇటీవల ఉచితాల హవా ఎక్కువ కావడంతో.. వాటి ప్రస్తావన మేనిఫెస్టోల్లో ఎక్కువగా ఉంటుందని ఆశిస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఐపీఎల్ టీమ్ ని కానుకగా ఇస్తామని హామీ ఇవ్వడం విశేషం. అవును, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కాసేపటి క్రితమే విడుదలైంది. ఇందులో హాట్ టాపిక్ ఐపీఎల్ క్రికెట్ టీమ్.


మధ్యప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రజలపై హామీల వర్షం కురిపించింది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ భారాన్ని తగ్గిస్తామని చెప్పింది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఐపీఎల్ టీమ్ ఏర్పాటు చేయడం అనేది కాస్త విచిత్రమైన హామీగా నిలిచిపోయింది. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పాటుపడతాం, స్టేడియంలు నిర్మిస్తాం, క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తాం అని చెప్పడానికి బదులు.. పక్కా కమర్షియల్ అయిన ఐపీఎల్ టీమ్ ని తీసుకొస్తామని చెప్పడం విశేషం. మధ్యప్రదేశ్ కి ఐపీఎల్ టీమ్ వస్తే సామాన్య ప్రజలకు కలిగే లాభమేంటో కాంగ్రెస్ నేతలకే తెలియాలి.

106 పేజీలు.. 59 హామీలు..

కాంగ్రెస్ పార్టీపై కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం బాగా కనపడుతోంది. అక్కడ ఉచితాలే తమని గద్దనెక్కించాయనేది కాంగ్రెస్ ఆలోచన. అందుకే ఏ రాష్ట్రంలో ఎన్నికలయినా విపరీతంగా ఉచితాలను తెరపైకి తెస్తోంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో 106 పేజీలతో నిండిపోయింది. మొత్తం 59 హామీలు ఇందులో ఉన్నాయి. రూ.2 లక్షల మేర రైతు రుణాలను మాఫీ చేస్తామని, అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.1500 భృతి చెల్లిస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొంది. రూ.10 లక్షల మేర పౌరులకు ప్రమాద బీమా కూడా కల్పిస్తామని తెలిపింది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, పాఠశాల విద్యను పూర్తి ఉచితంగా అందించడంతోపాటు, నిరుద్యోగ భృతి కూడా చెల్లిస్తామని చెప్పింది.

230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 17న పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ 144మందితో తొలి జాబితా మాత్రమే ప్రకటించింది. మాజీ సీఎం కమల్ నాథ్ సారధ్యంలోనే ఈసారి కూడా కాంగ్రెస్ ఎన్నికలను ఎదుర్కోబోతోంది.

First Published:  17 Oct 2023 10:36 AM GMT
Next Story