Telugu Global
Telangana

హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్న లండన్ స్టాక్ ఎక్ఛేంజ్ గ్రూప్

ఎల్ఎస్ఈజీ సీఐవో ఆంటొనీ మెక్‌కార్థీతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయడానికి సమావేశంలో అంగీకారం కుదిరింది.

హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్న లండన్ స్టాక్ ఎక్ఛేంజ్ గ్రూప్
X

తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతున్నది. 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న లండన్ స్టాక్ ఎక్ఛేంజి అనుబంధ లండన్ స్టాక్ ఎక్చేంజ్ గ్రూప్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నది. హైదరాబాద్‌లో లండన్ స్టాక్ ఎక్ఛేంజ్‌ గ్రూప్‌కు సంబంధించి టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. యూకే పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ తన బృందంతో శుక్రవారం లండన్‌లోని ఎల్ఎస్ఈజీని సందర్శించారు.

ఎల్ఎస్ఈజీ సీఐవో ఆంటొనీ మెక్‌కార్థీతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఈ భేటీలో అంగీకారం కుదిరింది. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు వల్ల ఏడాదికి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ఎల్ఎస్ఈజీ సీఐవో ఆంటోని, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

ప్రపంచంలోని అనేక ఫైనాన్షియల్ మార్కెట్లకు మౌలిక వసతులతో పాటు డేటాను ఎల్ఎస్ఈజీ అందిస్తోంది. దాదాపు మూడు శతాబ్ధాలుగా లండన్ స్టాక్ ఎక్ఛేంజ్ గ్రూప్ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 70 దేశాల్లో కంపెనీ కార్యకలాపలు ఉన్నాయి. 190 దేశాల్లో సంస్థకు కస్టమర్లు ఉన్నారు.

ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ తెలంగాణలోకి అడుగు పెట్టడం చాలా సంతోషకరమైన విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కంపెనీ రాక బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్స్యూరెన్స్ రంగాల్లో హైదరాబాద్‌కు మరింత ఉత్తేజాన్ని ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ అఫైర్స్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, ఐటీ శాఖ సీఆర్వో ఆత్మకూరి అమర్ కూడా పాల్గొన్నారు.


First Published:  12 May 2023 12:09 PM GMT
Next Story