Telugu Global
Telangana

ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి, వైస్ చైర్మన్‌గా ఎస్కే మహమూద్ నియామకం

రెండేళ్లుగా ప్రొఫెసర్ లింబాద్రి తాత్కాలిక చైర్మన్‌గా చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం.. తాజాగా పూర్తి స్థాయి చైర్మన్‌గా నియమించింది.

ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి, వైస్ చైర్మన్‌గా ఎస్కే మహమూద్ నియామకం
X

తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి, వైఎస్ చైర్మన్‌గా డాక్టర్ ఎస్కే. మహమూద్‌లను నియమిస్తూ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి అరుణ జీవో జారీ చేశారు. వీరిద్దరూ వారి పదవుల్లో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని జీవోలో పేర్కొన్నారు. ప్రొఫెసర్ లింబాద్రి ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2021 అగస్టు 24 నుంచి ఆయన ఇంచార్జి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

గత రెండేళ్లుగా ప్రొఫెసర్ లింబాద్రి తాత్కాలిక చైర్మన్‌గా చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం.. తాజాగా పూర్తి స్థాయి చైర్మన్‌గా నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న లింబాద్రి.. జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పూర్తి స్థాయి చైర్మన్ హోదా లభించింది. ఎస్సీ (మాల) సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ లింబాద్రి.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో జన్మించారు. సాంఘీక సంక్షేమ హాస్టల్‌లో ఉండి పాఠశాల విద్యను పూర్తి చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఓయూలో ప్రొఫెసర్‌గా చేరిన ఆయన.. 28 ఏళ్ల పాటు బోధనా వృత్తిలో రాణించారు. గతంలో సికింద్రాబాద్ పీజీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపాల్, బీవోఎస్ డైరెక్టర్, అకడమిక్ ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, ఓయూ శతాబ్ది ఉత్సవాల సమయంలో ఓయూ వీసీ ఓఎస్డీగా పని చేశారు. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

వైఎస్ చైర్మన్‌గా నియమితులైన డాక్టర్ ఎస్కే. మహమూద్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జూపల్లి గ్రామం. ఓయూ బోటనీ విభాగం హెచ్‌వోడీగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, బయో ఇన్ఫర్మేటిక్స్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా పూర్తి చేసిన మహమూద్.. 31 ఏళ్ల పాటు బోధనారంగంలో పని చేశారు. గతంలో సైఫాబాద్ పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా.. ఓయూ బోటనీ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీగా పని చేశారు. కాగా, ఉన్నత విద్యా మండలిలో దళిత, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించడం పట్ల సీఎం కేసీఆర్‌కు ఆయా వర్గాలు ధన్యవాదాలు తెలిపాయి.

First Published:  27 Jun 2023 1:14 AM GMT
Next Story