Telugu Global
Telangana

కేసీఆర్ పాలనలోనే గిరిజనుల బతుకుల్లో వెలుగులు : మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో గిరిజన బతుకుల్లో సమూల మార్పు వచ్చిందని అన్నారు. తెలంగాణలోని 3,144 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని, రూ.2వేల కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు వేయించినట్లు మంత్రి చెప్పారు.

కేసీఆర్ పాలనలోనే గిరిజనుల బతుకుల్లో వెలుగులు : మంత్రి సత్యవతి రాథోడ్
X

సీఎం కేసీఆర్ పాలనలోనే గిరిజన బతుకుల్లో వెలుగులు నిండాయి. ఆయన గిరిజనుల పక్షపాతి అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన జాతీయ బంజారా మీట్-2023లో మంత్రి సత్యవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోడీ గిరిజనులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఆయనది అంతా కపట ప్రేమే అని దుయ్యబట్టారు.

తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో గిరిజన బతుకుల్లో సమూల మార్పు వచ్చిందని అన్నారు. తెలంగాణలోని 3,144 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని, రూ.౨ వేల కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు వేయించినట్లు ఆమె చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల అమలుతో విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగినట్లు మంత్రి సత్యవతి చెప్పారు. బీజేపీ నేతల మాత్రం అధికారంలోకి వస్తే ప్రతీ తండాలో గుడి కట్టిస్తామని చెప్తున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో బంజారా భవన్ నిర్మించినట్లుగానే, ఢిల్లీలో కూడా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా అధికారంగా నిర్వహించాలని చెప్పారు. అలాగే దేశంలో 14 కోట్ల మంది మాట్లాడుతున్న లంబాడీ భాషను ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చి.. అధికార భాషగా కేంద్రం గుర్తించాలని ఆమె కోరారు.

బీజేపీని ప్రజలు నిలదీయాలి..

మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీని రానున్న ఎన్నికల్లో ప్రజలు నిలదీయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్రంలో డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితులు లేవన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పట్టణాలు, గ్రామాల అభివృద్ధి కోసం రూపాయి ఖర్చు పెట్టని బీజేపీని ప్రజలు తిరస్కరించే రోజులు వచ్చాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు పగటి వేషాలు ధరించి వస్తారని.. వీరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత పాలకులు దశాబ్దాలుగా చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలో చేసి చూపించారని అన్నారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్ చర్యలు చేపట్టారని అన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నాయకత్వంలో రూ.3,800 కోట్ల విలువైన పనులు జరిగాయని అన్నారు. ప్రజల కోసం, ప్రజల మధ్య తిరుగుతున్న నరేందర్‌ను మరోసారి గెలిపించుకోవల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని మంత్రి సత్యవతి అన్నారు.

First Published:  29 May 2023 1:53 AM GMT
Next Story