Telugu Global
Telangana

రాజకీయాలు తక్కువ, అభివృద్దికార్య‌క్రమాలు ఎక్కువ చేద్దాం -కేటీఆర్

''నాకు తెలుసు, మీకు తెలుసు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే.. వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. ప్రభుత్వం రాగానే హయత్ నగర్ వరకు మెట్రో పొడిగింపు పనులు మొదలు పెడతాం'' అని కేటీఆర్ అన్నారు

రాజకీయాలు తక్కువ, అభివృద్దికార్య‌క్రమాలు ఎక్కువ చేద్దాం -కేటీఆర్
X

హైదరాబాద్ లో అభివృద్ది, అద్భుతమైన మౌలిక వసతులు చూసి దేశంలోని 28 రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ స్థిర నివాస‍ం ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్‌బీనగర్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన కేటీఆర్‌, అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.... బతికినంత కాలం మతాలు, కులాల పేరుతో కొట్టుకుంటాం, కనీసం మరణించాక అయినా ఒక్క చోటే అంత్యక్రియలు జరపాలన్న సదుద్దేశం తో ఈ స్మశాన వాటిక నిర్మించామన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో టీఆరెస్ ప్రభుత్వం అభివృద్ది , సంక్షేమం జోడించి పరిపాలనలో సమతుల్యత పాటిస్తోందన్నారు కేటీఆర్. పేదవారి మొహాల్లో సంతోషం కోసం , ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నామన్నారు. పట్టణాభివృద్ది , గ్రామీణాభివృద్ది రెండూడు రెండు కన్నుల్లా చేస్తున్నామని తెలిపారు కేటీఆర్.

గతంలో తెలంగాణ తలసరి ఆదాయం 1లక్షా24వేలుండగా , ఇప్పుడు 2 లక్షల78 వేలకు పెరిగింది. 5లక్షల‌ 6వేలున్న రాష్ట్ర స్థూల‌ ఆదాయం (జీఎస్ డీపి) ఈ రోజు 11 లక్షల 55 వేల కోట్లకు పెరిగిందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా చేసిన అభివృద్ది వల్ల ఇది సాధ్యపడిందని ఆయన చెప్పారు.

దేశంలోని ఉత్తమమైన‌ 20 గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణవి, దేశంలో అత్యుత్తమ‌ మున్సిపాల్టీల్లో 26 తెలంగాణవే అని కేటీఆర్ తెలిపారు. ఈ విషయం తాను చెప్తున్నది కాదని కేంద్రమే ఆమేరకు అవార్డులిచ్చిందని తెలిపారు.

985 కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రాం (ఎస్ ఎన్ డీపీ )కింద నగరం నలువైపులా ఉన్న నాలా సమస్య ను పరిష్కరిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ప్రతి సారీ రాజకీయాలే చేయొద్దని, ప్రజలకు ఉపయోగపడే పనులు ఎక్కువగా చేసి రాజకీయాలు తక్కువగా చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. తాము ఆ విధంగా ముందుకు పోతున్నాం కాబట్టే తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకపోతుందన్నారు.

నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మధ్య ఐదు కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని రెండో ఫేజ్‌లో పూర్తి చేస్తాం. వచ్చే ఎన్నికల తర్వాత ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోను విస్తరిస్తాం. నాకు తెలుసు, మీకు తెలుసు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే.. వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. ప్రభుత్వం రాగానే హయత్ నగర్ వరకు మెట్రో పొడిగింపు పనులు మొదలు పెడతాం అని కేటీఆర్ అన్నారు

First Published:  6 Dec 2022 7:36 AM GMT
Next Story