Telugu Global
Telangana

ఏడు సీట్లపైన వామపక్షాలు కన్నేశాయా?

బోయే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్-వామపక్షాలు కలిసి పోటీ చేయబోతున్నాయి. పొత్తులో భాగంగా ఒకే జిల్లాలో వామపక్షాలకు ఏడు సీట్లు ఇవ్వటానికి కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారా లేదా అన్నది తెలీదు. వామపక్షాలైతే ఖమ్మం జిల్లాలోని 7 నియోజకవర్గాలపై కన్నేశాయన్నది వాస్తవం.

ఏడు సీట్లపైన వామపక్షాలు కన్నేశాయా?
X

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్-వామపక్షాలు కలిసి పోటీ చేయబోతున్నాయి. పొత్తులో భాగంగా ఎన్నోకొన్ని సీట్లను కేసీఆర్‌ వామపక్షాలకు త్యాగం చేయకతప్పదు. మిగిలిన సీట్లలో బీఆర్ఎస్ లాభపడాలంటే కొన్నిసీట్లలో త్యాగానికి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే కేసీఆర్‌ సీనియర్ నేతలతో పాటు కొందరు సిట్టింగులకు సంకేతాలు ఇచ్చారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వామపక్షాలకు మొదటి నుండి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనే బాగా పట్టుంది. కాబట్టి రేపటి ఎన్నికల్లో కూడా పై రెండు జిల్లాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయని టాక్.

ఇందులో కూడా ఎక్కువగా ఖమ్మం జిల్లాలోని ఏడు నియోజకవర్గాలపైన కన్నేశాయట. ఖమ్మం, పాలేరు, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, వైరా, ఇల్లెందులో పోటీకి వామపక్షాలు రెడీ అవుతున్నాయి. పాలేరు, మధిర, భద్రాచలంలో సీపీఎం, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, ఇల్లెందులో సీపీఐ రెడీ అవుతోంది. నల్గొండ జిల్లాలో సీట్ల సంఖ్య ఇంకా తేలలేదు. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే పాలేరులో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రచారం చేసేసుకుంటున్నారు. అలాగే కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్ధిగా కూనంనేని సాంబశివరావు ప్రచారం మొదలుపెట్టేశారు.

బీఆర్ఎస్, వామపక్షాల మధ్య పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం సీట్ల విషయంలో పంచాయితీ తప్పకపోవచ్చు. ఎందుకంటే పాలేరులో పోటీకి తుమ్మల నాగేశ్వరరావు రెడీ అవుతున్నారు. అలాగే కొత్తగూడెం సీటును త్యాగం చేయటానికి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రెడీగా లేరు. నిజానికి పాలేరులో కాంగ్రెస్ తరపున గెలిచి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో చేరిన కందాళం ఉంపేంద్రకే సీటు అని స్వయంగా కేసీఆరే ప్రకటించారు. సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని కేసీఆర్‌ చేసిన ప్రకటనతో కందాళంకు కూడా సీటు గ్యారెంటీ అయ్యింది.

పై ఏడు సీట్లుపోగా మిగిలిన మూడు సీట్లు సత్తుపల్లి, పినపాక, అశ్వారావుపేటలో బీఆర్ఎస్‌కు ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరీ నియోజకవర్గాన్ని సీపీఐకి ఇవ్వటానికి కేసీఆర్‌ అంగీకరిస్తారా? అలాగే ఒకే జిల్లాలో వామపక్షాలకు ఏడు సీట్లు ఇవ్వటానికి కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారా లేదా అన్నది కూడా తెలీదు. మొత్తానికి వామపక్షాలైతే జిల్లాలోని ఏడు నియోజకవర్గాలపై కన్నేశాయన్నది వాస్తవం.

First Published:  18 Jan 2023 6:09 AM GMT
Next Story