Telugu Global
Telangana

మారిన ఎల్బీనగర్ చౌరస్తా పేరు.. ఇకపై శ్రీకాంతాచారి జంక్షన్..

ఎల్బీనగర్ సర్కిల్ వద్ద ప్రభుత్వం 32 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్‌ను నిర్మించింది. ఈ ఫ్లైఓవర్‌కు మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్‌గా, ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి జంక్షన్‌గా పేరు పెడుతూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

మారిన ఎల్బీనగర్ చౌరస్తా పేరు.. ఇకపై శ్రీకాంతాచారి జంక్షన్..
X

హైదరాబాద్ మహానగరంలోని పెద్ద చౌరస్తాల్లో ఎల్బీనగర్ చౌరస్తా ఒకటి. ఇప్పుడు ఈ చౌరస్తా పేరును శ్రీకాంతాచారి జంక్షన్‌గా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అక్కడ నిర్మించిన ఫ్లైఓవర్‌కు మాల్ మైసమ్మ ఫ్లైఓవర్‌గా పేరు పెట్టింది. మలి దశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది కాసోజు శ్రీకాంతాచారి ఆత్మార్పణ తర్వాతే. కేసీఆర్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన 2009 నవంబర్ 29న ఎల్బీనగర్ చౌరస్తాలో అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్నారు. శరీరం నిలువెల్లా కాలుతున్నా.. జై తెలంగాణ నినాదాలు మాత్రం ఆపలేదు.

ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంతాచారి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజులు మృత్యువుతో పోరాడి 2009 డిసెంబర్ 3వ తేదీన మరణించారు. ఈ అమరవీరుడి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు పెడతామని మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల కిందట ప్రకటించారు.

తాజాగా ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. ఎల్బీనగర్ సర్కిల్ వద్ద ప్రభుత్వం 32 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్‌ను నిర్మించింది. ఈ ఫ్లైఓవర్‌కు మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్‌గా, ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి జంక్షన్‌గా పేరు పెడుతూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

First Published:  20 May 2023 4:57 PM GMT
Next Story