Telugu Global
Telangana

బీజేపీ జిల్లా అధ్యక్షుల బండారం మొత్తం బయటేసిన కుంజా సత్యవతి

ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిత్యం తాగుతూ తిరుగుతుంటాడని.. చావులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లి తినడమే కాకుండా కూరలు పొట్లాలు కట్టించుకొని కారులో తింటాడంటూ సత్యవతి ఆరోపించారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుల బండారం మొత్తం బయటేసిన కుంజా సత్యవతి
X

తెలంగాణలో ఈ సారి ఎలాగైనా అధికారం చేపట్టాలని బీజేపీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం సరి కొత్త వ్యూహాలతో అడుగులు వేస్తోంది. కానీ, అదే సమయంలో కొన్ని జిల్లాల్లో పార్టీ అంతర్గత కుమ్ములాటలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. పార్టీ పరువు బజారున పడేస్తున్నారు. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉండి.. ఇప్పుడు బీజేపీ పంచన చేరిన నాయకులు కలిసి పని చేయలేక ఒకరిని మరొకరు నిందించుకుంటున్నారు. తాజాగా, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిన మాటల ఆడియో పార్టీని కలవరపెడుతోంది.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి పార్టీ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని), ములుగు జిల్లా అధ్యక్షుడు భైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలను ఎలా మోసం చేసింది ఆమె ఆ కాల్‌లో చెప్పుకుంటూ పోయారు. గోదావరికి వరదల వచ్చిన సమయంలో పార్టీ పంపించిన నిధులను ఎలా దుర్వినియోగం చేశారో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామంటూ ఎలా మోసం చేస్తున్నారో కూడా వివరించారు.

ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిత్యం తాగుతూ తిరుగుతుంటాడని.. చావులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లి తినడమే కాకుండా కూరలు పొట్లాలు కట్టించుకొని కారులో తింటాడంటూ సత్యవతి ఆరోపించారు. గవర్నర్ తమిళిసై వచ్చినప్పుడు కూడా భద్రాచలంలో బైరెడ్డి హల్ చల్ చేశాడని.. పక్కజిల్లా నాయకుడికి భద్రాద్రి జిల్లాలో పనేంటని ఆమె ప్రశ్నించారు. వరద బాధితులకు పంచమని ఇచ్చిన డబ్బులను సగం దోచేశాడని ఆమె ఆరోపించారు.

కలిసిన ప్రతీ వారికి అసెంబ్లీ టికెట్ ఇస్తానంటూ వాగ్దానం చేస్తున్నాడని.. మండలానికి ఇద్దరికి ఇలా మాటిస్తున్నాడు.. మరి ఎన్ని అసెంబ్లీ టికెట్లు ఉంటాయని ఆమె కాల్‌లో ఎద్దేవా చేశారు. అలాగే కోనేరు చిన్ని కూడా పేకాడుతూ పార్టీ వ్యవహారాలు గాలికి వదిలేశాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. వరద బాధితుల పరామర్శకు గరికపాటి మోహన్‌రావు (ఎంపీ) వచ్చినప్పుడు లేనిపోనివి అన్నీ చెప్పారని కుంజా సత్యవతి అన్నారు. గరికపాటికి కూడా భద్రాచలం రావడం ఇష్టంలేదంటూ ఆమె చెప్పుకొచ్చారు. బాధితులకు ఇవ్వాల్సిన దుప్పట్లు కూడా దాచేసుకున్నారంటూ సత్యవతి ఫోన్‌లో సదరు వ్యక్తికి చెప్పారు.

ఇప్పుడు ఈ ఆడియో భద్రాద్రి, ములుగు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రంలోని బీజేపీ నాయకులను ఇరుకున పడేసింది. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉంటూ ఆరోపణలు చేసుకున్న నాయకులు.. ఇప్పుడు బీజేపీలో కూడా అదే పోకడలతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇది బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. కుంజా సత్యవతి ఫోన్ కాల్‌పై రాష్ట్ర నాయకత్వం మండిపడుతోంది. ఆమె నుంచి సంజాయిషీ కోరాలని నిర్ణయించుకున్నది. మరి సత్యవతి ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

First Published:  30 July 2022 10:39 AM GMT
Next Story