Telugu Global
Telangana

చెప్పిందే జరిగింది.. తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా

సన్నబియ్యం కొనుగోలులో వెయ్యికోట్ల కుంభకోణం జరిగింది. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ నేతలకు ముడుపులు వెళ్లాయి. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే జెడ్ స్పీడ్‌లో కుంభకోణం జరిగింది.

చెప్పిందే జరిగింది.. తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా
X

కాంగ్రెస్‌ వస్తే తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చెబుతున్నామన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇవాళ అదే జరిగిందన్నారు. గల్లీలో దోచుకో.. ఢిల్లీలో ఉండే కాంగ్రెస్‌ పెద్దలకు ఇచ్చుకో అన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కుంభకోణాలకు కాంగ్రెస్‌ తెరలేపిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌.. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు.

"సన్నబియ్యం కొనుగోలులో వెయ్యికోట్ల కుంభకోణం జరిగింది. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ నేతలకు ముడుపులు వెళ్లాయి. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే జెడ్ స్పీడ్‌లో కుంభకోణం జరిగింది. పాడిలో మొదటి స్కామ్‌, పాఠశాలల్లో సన్నబియ్యం విషయంలో రెండో స్కామ్‌. రెండిట్లో దాదాపు రూ.1100 కోట్లు స్కామ్‌ జరిగింది. వారం కిందట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా ఈ ఆరోపణలను ఆధారాలతో బయటపెట్టారు. కానీ దీనిపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గానీ, సీఎం రేవంత్‌ రెడ్డి గానీ ఈరోజు వరకు పెదవి విప్ప లేదు" అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నిర్దిష్టమైన ఆధారాలతో బయటపెడుతున్నామన్నారు కేటీఆర్.

కేంద్రంతో కుమ్మక్కయి..

ధాన్యం కొనుగోలు, కాంట్రాక్టు, MSP అంతా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉంటుందన్నారు కేటీఆర్‌. రేవంత్ సర్కారు అవినీతిపై ఇక్కడి బీజేపీ నాయకుడు గొంతు చించుకుంటున్నా కేంద్రంలో ఉన్న FCI నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యే అవినీతికి పాల్పడినట్లు స్పష్టమవుతోందన్నారు కేటీఆర్‌.

First Published:  26 May 2024 9:45 AM GMT
Next Story