Telugu Global
Telangana

కొత్త ట్విస్ట్.. కుమారి ఆంటీకి వినతిపత్రాలు

సోషల్ మీడియాలో దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. అయితే అధికార వర్గాలు మాత్రం స్పందించలేదు. అసలు రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్ కి వెళ్తారా లేదా అనేది కూడా ఇంకా తేలలేదు.

కొత్త ట్విస్ట్.. కుమారి ఆంటీకి వినతిపత్రాలు
X

తెలంగాణలో కుమారి ఆంటీ వ్యవహారం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. రోడ్ సైడ్ ఆమె నడుపుతున్న ఫుడ్ స్టాల్ పాపులర్ కావడం, ఏపీ సీఎం జగన్ గురించి ఆమె పాజిటివ్ గా మాట్లాడటం, ఆ వెంటనే హైదరాబాద్ లో హోటల్ మూసివేయాలంటూ పోలీసులు తేల్చి చెప్పడం, సీఎం రేవంత్ రెడ్డి నుంచి భరోసా.. ఇలా ప్రతి రోజూ కుమారి ఆంటీ టాపిక్ వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆమె మళ్లీ వార్తల్లోకెక్కారు. ఈసారి తెలంగాణలో కొంతమంది నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టి వినతిపత్రాలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నా కుమారి ఆంటీ హోటల్ కి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడమేంటని కొందరు నిలదీస్తున్నారు. పలు సందర్భాల్లో నిరసనలు తెలిపే క్రమంలో వారు నేరుగానే ప్రభుత్వాన్ని కుమారి ఆంటీ సంఘటనను హైలైట్ చేసి ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలు కూడా పరిష్కరించాలంటున్నారు. తాజాగా కొందరు నిరుద్యోగులు ఆమె హోటల్ వద్దకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మీ హోటల్ కి వస్తానన్నారు కదా, ఆయన వస్తే తమ సమస్యలు కూడా చెప్పండి అంటూ ఓ వినతిపత్రం ఇవ్వబోయారు. జీవో 46ని రద్దు చేయాలని రేవంత్ రెడ్డికి సిఫారసు చేయాలన్నారు. నిరుద్యోగులు చుట్టుముట్టడంతో ఆమె ఇబ్బంది పడ్డారు. తనకు ఈ విషయాలేవీ తెలియదని, తనను ఇబ్బంది పెట్టొద్దని, రోడ్డుపై ట్రాఫిక్ కి అంతరాయం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రచారం కోసమేనా..?

కుమారి ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు బాగా పాపులర్. అందుకే చాలామంది ప్రచారం కోసం ఆమెను ఆశ్రయిస్తున్నారు. నిరుద్యోగులు ఆమెకు వినతిపత్రం ఇవ్వాలనుకోవడం కూడా దీనికోసమే. ఈ క్రమంలో ఆమెను అనవసరంగా ఇబ్బంది పెట్టడం సరికాదనే వాదన కూడా వినపడుతోంది. మీడియా, సోషల్ మీడియా రేటింగ్స్ కోసం, మిగతా వర్గాల వారు తమ సమస్యలు హైలైట్ చేయడం కోసం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ని వాడుకోవాలని చూడటం సరికాదంటున్నారు. సోషల్ మీడియాలో దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. అయితే అధికార వర్గాలు మాత్రం స్పందించలేదు. అసలు రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్ కి వెళ్తారా లేదా అనేది కూడా ఇంకా తేలలేదు.

First Published:  4 Feb 2024 4:15 AM GMT
Next Story