Telugu Global
Telangana

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ.. కేటీఆర్‌ రియాక్షన్ ఇదే..!

పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలని పట్టుదలతో ఉన్న గులాబీ పార్టీ.. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు సైతం నిర్వహిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ.. కేటీఆర్‌ రియాక్షన్ ఇదే..!
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు సైతం నిర్వహిస్తోంది. మెజార్టీ స్థానాల్లో గెలిచేందుకు పావులు కదుపుతోంది. బలమైన అభ్యర్థులను లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంచాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను లోక్‌సభ ఎన్నికల బరిలో దించేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మల్కాజ్‌గిరి లేదా సికింద్రాబాద్‌ స్థానాల్లో ఏదో ఒక చోట కేటీఆర్‌ను నిలబెట్టే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశం చర్చకు వచ్చినప్పుడు కేటీఆర్‌ సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. ఆ ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించలేదని కూడా సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయిస్తే కేటీఆర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేటీఆర్‌ లోక్‌సభలో ఉంటే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రాధాన్యత పెరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలని పట్టుదలతో ఉన్న గులాబీ పార్టీ.. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు సైతం నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో క్యాడర్ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అదే జోరు కొనసాగించలేకోపోయింది కారు పార్టీ. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవడమే టార్గెట్‌గా పెట్టుకున్న బీఆర్ఎస్‌.. 9 స్థానాలకే పరిమితమైంది. అనూహ్యంగా బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 7 పార్లమెంట్ స్థానాల పరిధిలో మాత్రమే ఆధిక్యం కనబరిచింది. ఇందులో మూడు స్థానాల్లో స్వల్ప తేడాతో మాత్రమే ముందుంది. 4 ఎంపీ స్థానాల పరిధిలో బొటాబొటిగా ముందుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో మెజార్టీ లోక్‌సభ స్థానాలు సాధించడం బీఆర్ఎస్‌కు అంత సులువు కాదు. దీంతో అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని 7 స్థానాలను బీఆర్ఎస్‌ సొంతం చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్‌కు మొత్తంగా 9 లక్షల 38 వేల ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 5 లక్షల 83 వేలు, బీజేపీకి 4 లక్షల 25 వేలు వచ్చాయి. ఇక సికింద్రాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ 6, MIM ఒక్క స్థానం గెలుచుకున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్‌కు 4 లక్షల 63 వేల ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 2 లక్షల 80 వేల ఓట్లు, బీజేపీకి 2 లక్షల 16 వేల ఓట్లు వచ్చాయి. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి కేటీఆర్‌ను పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First Published:  7 Jan 2024 6:27 AM GMT
Next Story