Telugu Global
Telangana

కరెంట్‌పై సోషల్ మీడియా స్పందనలకు కేటీఆర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ఈ దేశంలో ఒక్క తెలంగాణ తప్ప వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న మరో రాష్ట్రం ఎక్కడైనా ఉంటే ప్రతిపక్షాలు చూపించాలని చాలెంజ్ చేశారు.

కరెంట్‌పై సోషల్ మీడియా స్పందనలకు కేటీఆర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
X

నరేంద్రమోడీ రైతుల చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తూ వ్యవసాయానికి ఉరి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రైతులు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మన్నెగూడలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ప్రసంగించిన కేటీఆర్ కీలక అంశాలను ప్రస్తావించారు.

ఈరోజే అన్ని పత్రికల్లోనూ వచ్చిందని, ప్రపంచ ఆహార సూచికలో.. 116 దేశాలకు ర్యాంకులు ఇస్తే గతేడాది 101గా ఉన్న భారత్ ర్యాంకు ఇప్పుడు 107వ స్థానానికి దిగజారిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆహార సూచికలో దక్షిణాసియాలో ఒక్క ఆఫ్ఘనిస్తాన్‌ తప్ప పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లదేశ్‌, నేపాల్‌ కూడా మన కంటే మెరుగ్గా ఉన్నాయని కేటీఆర్ వివరించారు.

పెద్దలు చెప్పినట్టుగా ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని.. ఇప్పుడు దేశంలో రైతుల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. రైతు కంట కన్నీరు తుడిచే నాయకత్వం దేశంలో లేదన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే రైతు కన్నీరు తుడిచే నాయకత్వం ఉందన్నారు. పదేళ్లు వెనక్కు వెళ్తే.. పల్లెటూరులో ఎవరైనా చనిపోతే అంత్య‌క్రియలకు తీసుకెళ్లేటప్పుడు బావి దగ్గర స్నానం చేయాల్సి ఉంటుందని అర్ధ‌గంట కరెంట్ ఇవ్వండి అన్న అని ఫోన్ చేసి బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.

తెలంగాణ రాకపోతే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్ కోతలు, చార్జీల మోతలు ఉండేవన్నారు. దేశంలో ఒకప్పుడు రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అగ్రభాగంలో ఉండేవని.. ఇప్పుడు అదే నల్లగొండ జిల్లా వరి పండించడంలో తెలంగాణలోనే నెంబర్‌వన్‌గా ఉందన్నారు. రైతు బిడ్డ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

పదేళ్ల క్రితం రోజుకు 10 గంటలు కరెంట్ పోయినా అడిగినవారు లేరని.. ఇప్పుడు వర్షానికి 15 నిమిషాలు కరెంట్ పోయినా.. సోషల్ మీడియాలో కరెంట్‌ పోయి 15 నిమిషాలైనా ఎందుకు రావడం లేదంటూ నిలదీస్తున్నారని.. నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ విమర్శలు చేస్తున్నారని.. పదేళ్ల క్రితం కరెంట్ ఉంటే వార్త, ఇప్పుడు కరెంట్ పోతే వార్త ఇదే తెలంగాణ సాధించిన ప్రగతి అని కేటీఆర్‌ వివరించారు.

ఈ దేశంలో ఒక్క తెలంగాణ తప్ప వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న మరో రాష్ట్రం ఎక్కడైనా ఉంటే ప్రతిపక్షాలు చూపించాలని చాలెంజ్ చేశారు. కర్నాటక, మహారాష్ట్రకు చెందిన కొందరు రైతులు సరిహద్దుల్లో కాలువ నుంచి తెలంగాణ విద్యుత్‌తో నీరు తోడుకుంటున్నారని, వాటిని తీసేద్దామని కేబినెట్‌లో అధికారులు ప్రతిపాదించారని.. అందుకే కేసీఆర్‌ వాళ్లు కూడా రైతులే కదా.. ఏ రాష్ట్రం వారైనా రైతు రైతే అని సర్దిచెప్పారని కేటీఆర్ వివరించారు.

తెలంగాణ ఏర్పడిన సమయంలో రాష్ట్రం మొత్తం మీద ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండేదని .. ఈరోజు మూడున్నర కోట్ల టన్నులకు చేరిందని ఇది రాష్ట్రం గర్వించదగ్గ విషయం కాదా అని ప్రశ్నించారు. పత్తి పంట విస్తీర్ణం గతంలో 40 లక్షల ఎకరాల్లో ఉంటే.. ఈరోజు 62 లక్షల ఎకరాల్లో పండించే స్థాయికి చేరుకున్నామన్నారు. ఏ బ్యాంకు అధికారైనా రైతు ఇంటి వద్దకు వచ్చి కిటికీలు, తలుపులు ఎత్తుకెళ్లే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు.

మోడీ తీరు దేశంలో ముగ్గురు నలుగురు ధనికులైతే దేశ సంపద మొత్తం పెరుగుతుందని భావిస్తున్నారని.. నల్లగొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కడూ ధనవంతుడు అయితే ఈ జిల్లా మొత్తం బాగుపడుతుందని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 18వేల కోట్ల కాంట్రాక్ట్‌ ఒక వ్యక్తికి ఇవ్వడం కాదు.. ఆ 18వేల కోట్లు నల్లగొండ జిల్లాకు ఇవ్వండి మేం పోటీ నుంచే తప్పుకుంటామని ప్రతిపాదించినా బీజేపీ నుంచి సమాధానం లేదన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడం చేతగాక.. తెలంగాణ ప్రజలకు నూకలు తినే అలవాటు నేర్పాలంటూ కేంద్ర మంత్రి గోయల్ మాట్లాడారని.. అలాంటి అహంకారులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

రైతుల చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తున్న నరేంద్రమోడీ.. బావుల దగ్గర మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ మీటర్లు కూడా ముందుగా రీచార్జ్ చేసుకుని కరెంట్ వాడుకునేలా మీటర్లు పెడుతున్నారని కేటీఆర్‌ వివరించారు. మీటర్లు పెట్టిన తర్వాత వ్యవస్థ మొత్తం నాశనం అవుతుందని..రైతులు బిల్లులు కట్టలేక వ్యవసాయం మానేసే రోజు వస్తుందన్నారు. ఇతర రాష్ట్రాలు సీరియస్‌గా తీసుకోకపోవచ్చని.. కానీ తెలంగాణలో మాత్రం మీటర్లు పెట్టేందుకు అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.

తెలంగాణలో అత్యధిక స్థాయిలో బోరు బావులు ఉన్నాయని.. అలాంటి చోట ప్రీఫెయిడ్ మీటర్లు పెడితే రైతుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఎత్తేయాలని మోడీ ప్రయత్నిస్తున్నారని.. అదే జరిగితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ధాన్యం సేకరణ కూడా ప్రైవేటీకరిస్తే ఇక రైతులకు మద్దతు ధర ఉండదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులను ట్రాక్టర్ల కింద తొక్కి చంపారని.. తెలంగాణ మాత్రం రైతులకు కాపాడుకునేందుకు కేసీఆర్‌ తెగించి పోరాడుతున్నారని.. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు రైతులు ముందుకు రావాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

First Published:  15 Oct 2022 12:12 PM GMT
Next Story