Telugu Global
Telangana

సీఎం రేవంత్‌కు కేటీఆర్ మొదటి లేఖ

అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోందన్నారు కేటీఆర్‌. అందుకు రోజు రోజుకూ తీవ్రమవుతున్న ఆటోడ్రైవర్ల సంక్షోభమే నిదర్శనమన్నారు.

సీఎం రేవంత్‌కు కేటీఆర్ మొదటి లేఖ
X

సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని సూచించారు. 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా..? అంటూ సీఎం రేవంత్‌కు ప్రశ్నలు సంధించారు.

ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకిగా మారిపోయిందన్నారు కేటీఆర్. అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోందన్నారు కేటీఆర్‌. అందుకు రోజు రోజుకూ తీవ్రమవుతున్న ఆటోడ్రైవర్ల సంక్షోభమే నిదర్శనమన్నారు. గత పదేళ్లు తెలంగాణలో సబ్బండవర్గాలు సంతోషంగా ఉంటే.. కేవలం 55 రోజుల కాంగ్రెస్‌ పరిపాలనలో సమాజంలోని అనేక వర్గాలు ఆగమవుతున్నాయన్నారు. ఇంతకాలం చెమటోడ్చి తమ కుటుంబాలను పోషించుకున్న ఆటోడ్రైవర్ల పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో అగమ్యగోచరంగా మారిందన్నారు కేటీఆర్‌.


రెండు నెలలు నిండని కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకు 15 మంది ఆటోడ్రైవర్ అన్నలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు కేటీఆర్‌. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆయా కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్నారు. అన్నం పెట్టిన ఆటో ఆకలి మంటల్లో కాలిపోయిన ఉదంతాన్ని చూసిన తరువాతైనా.. పరిస్థితి తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, రాష్ట్రంలోని 6.50 లక్షలాది మంది ఆటోడ్రైవర్ల పక్షాన కోరుతున్నానన్నారు కేటీఆర్‌. అనాలోచిత విధానాల వల్ల గత రెండు నెలలుగా ఉపాధి లేక రోడ్డున పడ్డ ఆటోడ్రైవర్ల కుటుంబాలను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్న ఆరున్నర లక్షల మంది డ్రైవర్లకు ప్రతినెలా రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ ఆటోలో ప్రయాణించి ఫొటోలకు ఫోజులిచ్చారని విమర్శించారు కేటీఆర్. ఆటో డ్రైవర్లతో సమావేశం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాలో వార్తల కోసం చూపిన తాపత్రయం, వారి సమస్య పరిష్కారానికి మాత్రం చూపలేదన్నారు. ఆ సమావేశం తర్వాత ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభవన్ అని పేరు మారిస్తే సరిపోదని.. ఆచరణలో చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలు హర్షిస్తారన్నారు. ప్రజాభవన్ ముందే ఆటోకు ఒక డ్రైవర్ నిప్పుపెట్టుకున్నా.. ముఖ్యమంత్రి ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోకపోతే.. అందరినీ కలుపుకుని ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

First Published:  2 Feb 2024 1:54 PM GMT
Next Story