Telugu Global
Telangana

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలంటే..?

2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉండాలనే విషయాన్ని ఈ గణాంకాల ద్వారా వారే నిర్ణయించుకోవాలని సూచించారు కేటీఆర్.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలంటే..?
X

ఈ ఏడాది జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ టీమ్ కు ఎందుకు ఓటు వేయాలనే విషయాన్ని క్లుప్తంగా వివరించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ గళాన్ని పార్లమెంట్ లో వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. ఉదాహరణగా కొన్ని గణాంకాలను ఆయన తన ట్వీట్ లో ప్రస్తావించారు.


ఇవీ లెక్కలు..

తెలంగాణ నుంచి లోక్ సభకు 17 స్థానాలున్నాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. అంటే 16వ లోక్ సభలో బీఆర్ఎస్ కి 11 సీట్లు రాగా, కాంగ్రెస్-2, బీజేపీ -1, ఎంఐఎం-1 స్థానాన్ని గెలుచుకున్నాయి. 16వ లోక్ సభ పరిధిలో బీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ లో మొత్తం 2726 ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ కేవలం 537, బీజేపీ ఎంపీలు కేవలం 12 ప్రశ్నలు మాత్రమే అడిగారు. ఇక్కడ బీఆర్ఎస్ కి ఉన్న ఎంపీల సంఖ్య ఎక్కువగానే కనపడుతున్నా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దేశవ్యాప్తంగా ఎంపీలున్నారు. ఆయా పార్టీల అధినాయకత్వానికి కూడా తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణకు వస్తున్న పథకాల గురించి, విభజన తర్వాత తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ప్రశ్నించే అవకాశముంది. కానీ పార్లమెంట్ లో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ తెలంగాణ గురించి పెద్దగా నోరు తెరవలేదు. తెలంగాణ వాణి వినిపించింది, సమస్య పరిష్కారానికి గళమెత్తింది కేవలం బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే.

17వ లోక్ సభలో బీజేపీ నలుగురు ఎంపీలను గెలిపించుకుంది. అయినా అడిగిన ప్రశ్నలు కేవలం 178మాత్రమే.. ముగ్గురు ఎంపీలున్న కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలు 734. బీఆర్ఎస్ ఎంపీలు 2028 ప్రశ్నలు అడిగారు. తెలంగాణపై కేంద్రం చూపెడుతోన్న వివక్షను గట్టిగా ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలు ఏం చేయాలి..?

2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉండాలనే విషయాన్ని ఈ గణాంకాల ద్వారా వారే నిర్ణయించుకోవాలని సూచించారు కేటీఆర్. పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినపడాలంటే అది బీఆర్ఎస్ ఎంపీల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. #TelanganaVoiceInParliament అనే హ్యాష్ ట్యాగ్ ను తన ట్వీట్ కు జతచేశారు.

First Published:  17 Jan 2024 6:33 AM GMT
Next Story