Telugu Global
Telangana

మెట్రో ప్రయాణికులకు షాక్..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదేనని, అదే సమయంలో మెట్రో ప్రయాణికులపై పార్కింగ్ ఫీజు భారం మోపడం దేనికని ప్రశ్నించారు కేటీఆర్.

మెట్రో ప్రయాణికులకు షాక్..
X

మెట్రో ప్రయాణికులకు షాక్ అంటూ పత్రికల్లో వచ్చిన ఓ వార్తను హైలైట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ వేశారు. మెట్రో ప్రయాణికుల విషయంలో ప్రభుత్వం ఎందుకిలా ప్రవర్తిస్తోందని ఆయన ప్రశ్నించారు. మెట్రో ప్రయాణాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఇలా రివర్స్ లో వారిని ఇబ్బంది పెట్టడమేంటని అడిగారు. దీనికి తెలంగాణ చీఫ్ సెక్రటరీకానీ, మెట్రో సంస్థ కానీ సమాధానం చెప్పాలని కోరారు కేటీఆర్.


మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ అనేది గతంలో ఉన్న ప్రతిపాదనే. నాగోల్ స్టేషన్లో ఆగస్ట్ 25నుంచి, మియాపూర్ స్టేషన్లో సెప్టెంబర్ 1 నుంచి వాహనాల పార్కింగ్ కు రుసుము వసూలు చేయాలని గతంలో మెట్రో సంస్థ నిర్ణయించింది. అయితే ప్రయాణికులనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో మెట్రో యాజమాన్యం వెనక్కి తగ్గింది. మళ్లీ ఇప్పుడు అక్కడ బోర్డ్ లు పెట్టడం చర్చనీయాంశమవుతోంది. సెప్టెంబర్ 15నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తామంటూ మెట్రో యాజమాన్యం నాగోల్, మియాపూర్ స్టేషన్ల వద్ద బోర్డ్ లు పెట్టింది. ఈ పార్కింగ్ ఫీజు వ్యవహారాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.

లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే ప్రతిపాదనతో మెట్రో విస్తరణకు ఓవైపు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా లేకపోయినా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ మెట్రో ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి మాత్రం సిద్ధమవుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదేనని, అదే సమయంలో మెట్రో ప్రయాణికులపై పార్కింగ్ ఫీజు భారం మోపడం దేనికని ప్రశ్నించారు. ఇలా ఫీజులు వసూలు చేస్తే మెట్రో ప్రయాణంపై ఆసక్తి తగ్గిపోతుందన్నారు. మెట్రోని ప్రోత్సహిస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, పార్కింగ్ ఫీజు మోతమోగిస్తే మెట్రో ప్రయాణాలు తగ్గి మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు కేటీఆర్.

First Published:  31 Aug 2024 1:26 PM GMT
Next Story