Telugu Global
Telangana

కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ ఖాయం - కేటీఆర్

పాలమూరు ఎత్తిపోతలకోసం అవ‌స‌ర‌మైతే న్యాయ‌పోరాటం చేద్దామన్నారు, ప్ర‌జాకోర్టులో తేల్చుకుందామన్నారు. 2024లో కేంద్రంలో మ‌న‌కు అనుకూలంగా వ‌చ్చే ప్ర‌భుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.

కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ ఖాయం - కేటీఆర్
X

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ప‌నిమంతుల‌కే ప‌ట్టం క‌ట్టండి అని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. నారాయ‌ణ‌పేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో పాల్గొన్న ఆయన, కేసీఆర్ నాయ‌క‌త్వంలో హ్యాట్రిక్ కొట్టాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

నారాయ‌ణ‌పేట జిల్లాలో రూ. 196 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశామ‌ని తెలిపారు మంత్రి కేటీఆర్. మంత్రులు కూడా ఈర్ష్య ప‌డేలా నారాయణ పేటను అభివృద్ధి చేస్తున్న రాజేంద‌ర్ రెడ్డికి అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కొండారెడ్డిప‌ల్లె చెరువులో బ‌తుక‌మ్మ ఘాట్, గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం కోసం ప్లాట్‌ ఫాం, మినీట్యాంక్ బండ్ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని సీనియ‌ర్ సిటిజన్ పార్కుని 80 లక్షల రూపాయల వ్యయంతో నారాయ‌ణ‌పేటలో ఏర్పాటు చేశామన్నారు. జిల్లా క‌లెక్ట‌రేట్, ఎస్పీ కార్యాల‌యానికి శంకుస్థాప‌నం చేశామన్నారు. రామాలయం, ఈద్గా, ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయానికి శంకుస్థాపన చేసినట్టు చెప్పారు.

పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు కేంద్రం అడ్డుపడినా కూడా ఆ ప‌ని పూర్తి చేసి రైతుల‌కు నీళ్లు అందించే బాధ్య‌త కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకుందని స్పష్టం చేశారు కేటీఆర్. ఎవ‌రికీ ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతలకోసం అవ‌స‌ర‌మైతే న్యాయ‌పోరాటం చేద్దామన్నారు, ప్ర‌జాకోర్టులో తేల్చుకుందామన్నారు. 2024లో కేంద్రంలో మ‌న‌కు అనుకూలంగా వ‌చ్చే ప్ర‌భుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.


మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌ లో జ‌రుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో సొల్లు పురాణం తప్ప మరోటి లేదన్నారు కేటీఆర్. రాష్ట్రం వేరు ప‌డ‌క ముందు తెలంగాణ ప్రాంతానికి 811 టీఎంసీల నీటి వాటా ఉందని ట్రిబ్యున‌ల్ తీర్పు ఇచ్చిందని, కనీసం ట్రిబ్యున‌ల్‌ కు లేఖ రాసేందుకు కేంద్రానికి, మోదీకి స‌మ‌యం దొర‌క‌డం లేద‌న్నారు. తెలంగాణ రాక‌ముందు వ్య‌వ‌సాయం ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో రైతులే ఆలోచించుకోవాలన్నారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు అడ్డుక‌ట్ట వేసినా, కోర్టుల్లో కేసులు వేసినా, నీళ్ల పంప‌కాల‌ను తేల్చ‌క‌పోయినా, 11 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు అందించామన్నారు.

కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటా తేల్చాల‌ని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు చిత్త‌శుద్ధి ఉంటే.. మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లా మీద ప్రేమ ఉంటే, పాల‌మూరులో నిర్వ‌హిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో తీర్మానం చేయాల‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం కోరుతున్న విధంగానే 500 టీఎంసీలు కేటాయించాల‌ని మోదీని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయండన్నారు. ద‌మ్ము, తెగువ ఉంటే ఆ తీర్మానం చేసి మీ చిత్త‌శుద్ది రుజువు చేసుకోండి అంటూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు కేటీఆర్.

First Published:  24 Jan 2023 2:46 PM GMT
Next Story