ఆ లవంగానికి పిచ్చి ముదిరింది.. బండిపై కేటీఆర్ పంచ్
బండి మాటలపై మంత్రి కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు. "ఈ లవంగం గారిని ఇలా వదిలెయ్యకండిరా బీజేపీ బాబులు.." అంటూ చురకలంటించారు.
పార్టీ పేరుని బీఆర్ఎస్‌గా మార్చడానికి ముందు కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో తాంత్రిక పూజలు చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తాంత్రిక పూజలు చేయడమే కాదు, ఆ తర్వాత పూజా ద్రవ్యాలు తీసుకెళ్లి కాళేశ్వరంలో కలిపారని.. అన్నీ దగ్గరుండి చూసినట్టే చెప్పారు బండి సంజయ్. పైకి కాళేశ్వరం సందర్శన అని చెప్పిన కేసీఆర్ సైలెంట్‌గా వెళ్లి పూజా ద్రవ్యాలు నీటిలో కలిపి వచ్చారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. బీఆర్ఎస్‌ని ఎదుర్కోలేక ఇలా తాంత్రిక పూజల స్థాయికి బండి సంజయ్ దిగజారారని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు. బండి మాటలపై మంత్రి కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు.
" ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు.
పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో. మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు
ఎర్రగడ్డలో బెడ్ తయారుగా ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి." అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఆ ట్వీట్ తోపాటు బండి సంజయ్ ప్రెస్‌మీట్ లో చేసిన వ్యాఖ్యల వీడియోని కూడా జోడించారు.
ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు.
— KTR (@KTRTRS) October 8, 2022
పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు
ఎర్రగడ్డలో బెడ్ తయారుగ ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి https://t.co/bCucYw6PM6
నిజంగానే పిచ్చి పట్టిందా..?
జాతీయ పార్టీ ప్రకటనకు ముందు కేసీఆర్ యాదగిరి గుట్టకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చారు. ఇది వాస్తవం. మరి ఫామ్‌హౌస్‌లో తాంత్రిక పూజల్ని బండి సంజయ్ ఎలా చూశారు. అందులోనూ కుటుంబ సభ్యులతో రహస్యంగా పూజలు చేశారని ఆరోపిస్తున్న సంజయ్‌కి వాటి గురించి లీకులిచ్చిందెవరు..? వీటికి మాత్రం సమాధానం లేదు. నోరుంది కదా అని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఇప్పటికే టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నుంచి బండి సంజయ్‌కి ఘాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. బండి సంజయ్‌కి కలలో కూడా కేసీఆరే గుర్తొస్తున్నారని, అందుకే ఆయన క్షుద్ర పూజల భ్రమలో ఉండిపోయారని అంటున్నారు. ఇప్పుడు పూర్తిగా బండిని పిచ్చివాడిగా లెక్కగట్టి కేటీఆర్ భలే పంచ్ విసిరారు. ఎర్రగడ్డలో బెడ్ కూడా సిద్ధం చేశామంటూ సెటైర్లు వేశారు.