Telugu Global
Telangana

రాష్ట్రానికి వరం కాళేశ్వరం.. కాంగ్రెస్‌ శనేశ్వరం - కేటీఆర్‌

రాహుల్ గాంధీకి చరిత్ర తెలవదని.. తెలుసుకునే సోయి కూడా లేదన్నారు కేటీఆర్‌. రాహుల్ తన స్క్రిప్ట్ లేదా స్క్రిప్ట్‌ రైటర్‌నన్న మార్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి వరం కాళేశ్వరం.. కాంగ్రెస్‌ శనేశ్వరం - కేటీఆర్‌
X

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్‌ కొనసాగుతోంది. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిలపై ఫైర్ అయ్యారు. ఇండియా పప్పు రాహుల్ గాంధీ అయితే.. తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి అంటూ సెటైర్లు వేశారు. ఇద్దరు ఎగేసుకుని వెళ్లి కాళేశ్వరం చూసొచ్చారని.. ఈ మహా ఇంజినీర్లు బ్రిడ్జి కూలిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చురకలు అంటించారు కేటీఆర్. తెలంగాణకు వరం కాళేశ్వరం.. దేశానికి శనేశ్వరం కాంగ్రెస్ అంటూ సెటైర్లు వేశారు.

రాహుల్ గాంధీకి చరిత్ర తెలవదని.. తెలుసుకునే సోయి కూడా లేదన్నారు కేటీఆర్‌. రాహుల్ తన స్క్రిప్ట్ లేదా స్క్రిప్ట్‌ రైటర్‌నన్న మార్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసిందన్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దావూద్ ఇబ్రహీం, చార్లెస్‌ శోభరాజ్‌ కంటే డేంజర్‌ అంటూ విమర్శించారు. నోటుకు ఓటు దొంగ రేవంత్ అలియాస్ రేటెంత రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ మాట్లాడడం దేశంలో అతిపెద్ద వింత అన్నారు కేటీఆర్‌.

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పటికైనా కాంగ్రెస్‌ నేతలు అబద్ధాలు మానుకోవాలన్నారు కేటీఆర్. ప్రాజెక్టు కోసం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తే.. లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందంటూ ప్రశ్నించారు. 2008లో కాంగ్రెస్‌ రూపొందించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.40 వేల కోట్లు అని..అందులో రిజర్వాయర్లు కూడా లేవన్నారు. కేవలం కాలువలు, పంపు హౌసులకే అంత అంచనా వేశారని.. 15 ఏళ్ల తర్వాత వ్యయం పెరగుతుందో లేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో SRSP కాలువల్లో క్రికెట్‌ ఆడుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు కేటీఆర్‌. ప్రాణహిత నదిలో నీటి లభ్యత ఎక్కువ ఉంది కాబట్టే..గోదావరిలో ఆ నది కలిసే చోట మేడిగడ్డకు అంకురార్పణ చేశామని వివరించారు. సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల ఇలా దాదాపు 10 కొత్త జలాశయాలు నిర్మించడం వల్లే దేశంలోనే అతిపెద్ద ధాన్యాగారంగా తెలంగాణ తయారైందన్నారు కేటీఆర్.


First Published:  2 Nov 2023 2:45 PM GMT
Next Story