Telugu Global
Telangana

మోసపోవద్దు, గోసపడొద్దు.. కరీంనగర్ సభలో కేటీఆర్

కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ని గెలిపిస్తే కనీసం కేంద్రం నుంచి ఒక్క బడి కూడా తేలేదని, గుడి కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు కేటీఆర్. గురుకులాలయినా, కాలేజీలయినా.. అన్నీ తీసుకొచ్చింది గుంగుల కమలాకర్ మాత్రమేనని చెప్పారు.

మోసపోవద్దు, గోసపడొద్దు.. కరీంనగర్ సభలో కేటీఆర్
X

కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేటీఆర్, మేనిఫెస్టో హామీలను మరోసారి ప్రజలకు వివరించారు. గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గిస్తున్నామని, పేదవారందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పెన్షన్ పెంపుతో పేదలకు మరింత అండగా నిలుస్తామని అన్నారు కేటీఆర్. కరీంనగర్ లో మళ్లీ అగ్గిపెట్టాలని, ఆ మంటల్లో బీజేపీ, కాంగ్రెస్ దహించుకుపోవాలని పిలుపునిచ్చారు.


ఓవైపు చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఉన్నారని, మరోవైపు తెలంగాణకోసం రాజీనామా చేయమంటే భయపడి అమెరికా పారిపోయిన కిషన్ రెడ్డి ఉన్నారని, ఓటుకు నోటు కేసులో సూట్ కేసులతో సహా కెమెరాలకు చిక్కిన దొంగ రేవంత్ రెడ్డి ఉన్నారని.. ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు కేటీఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగునీటితో కళకళలాడుతోందన్నారు. అభివృద్ధికి కారణం అయిన కేసీఆర్ ని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు తమకు మాత్రమే కాదని, కేసీఆర్ ని సీఎం చేయడానికి అని వివరించారు కేటీఆర్.

బడి లేదు, గుడిలేదు..

కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ని గెలిపిస్తే కనీసం కేంద్రం నుంచి ఒక్క బడి కూడా తేలేదని, గుడి కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు కేటీఆర్. గురుకులాలయినా, కాలేజీలయినా.. అన్నీ తీసుకొచ్చింది గుంగుల కమలాకర్ మాత్రమేనని చెప్పారు. టీటీడీతో మాట్లాడి తిరుమల లాంటి ఆలయం కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎంపీగా గెలిపిస్తే సమాధులు తవ్వుతామంటూ బండి అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని.. ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు తవ్వాల్సింది సమాధులు కాదని, పునాదులు అని.. కాల్వలు తవ్వి ప్రజలకు నీరందించాలని చెప్పారు. అభివృద్ధి చేయకపోగా, అరాచక శక్తులుగా ఉన్న వారిని ప్రజలు నమ్మొద్దని సూచించారు కేటీఆర్.

First Published:  18 Oct 2023 8:07 AM GMT
Next Story